హిజాబ్ వివాదం వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ?

కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం వెనుక పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ  జాతీయ మీడియా కధనాలు వెలువడుతున్నాయి. నిషేధానికి గురైన ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ జె ఎఫ్)  సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేయాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని కధనాలు వెలువడుతున్నాయి.
 
భారత దేశ వ్యతిరేక శక్తులు ఎఫ్ ఎఫ్ జె  చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలిపి, ‘ఉర్దూయిస్థాన్’ ఏర్పాటు కోసం డిమాండ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ కావాలంటూ వీరు డిమాండ్ చేయవచ్చునని పేర్కొంటున్నారు. 
 
భారతీయ ముస్లింల కోసం గురుపత్వంత్ సింగ్ విడుదల చేసిన వీడియో సందేశంలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కోసం ఉద్యమ నిర్వహణకు నిధులు ఇస్తామని, కార్యక్రమాలను నిర్వహిస్తామని భారతీయ ముస్లింలకు భరోసా ఇచ్చాడు.  
 
హిజాబ్ రిఫరెండం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌పాం స్క్రీన్‌షాట్స్, ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టేందుకు గురుపత్వంత్ ప్రసంగాలను వాడుకుంటున్నారు.
 
విదేశీ ప్రేరేపిత వాఖ్యాలను తిప్పికొట్టిన భారత్ 
 
మరోవంక, తరగతి గదుల్లో హిజాబ్ ధారణపై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని అమెరికా, తదితర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా ప్రశ్నలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. 
 
భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని హితవు చెప్పారు. ఎంఈఏ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్‌కు సంబంధించిన వివాదం న్యాయ పరిశీలనలో ఉందని, ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతోందని తెలిపింది.
భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంది. భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం, అదేవిధంగా ప్రజాస్వామిక లక్షణాలు, వాతావరణం, రాజ్య పరిపాలనలకు అనుగుణంగా వీటికి పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. భారత దేశం గురించి తెలిసినవారు ఈ వాస్తవాలను సరైన విధంగా అర్థం చేసుకోగలరని తెలిపింది.
కాగా, అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ ఇచ్చిన ట్వీట్‌లో, మతపరమైన దుస్తులను ఎంపిక చేసుకునే సామర్థ్యం కూడా మత స్వేచ్ఛలో భాగమేనని తెలిపారు. పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, మహిళలు, బాలికలను అణగదొక్కడమేనని ఆరోపించారు. హుస్సేన్ ఓ ఇండియన్-అమెరికన్.
ఇలా ఉండగా, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పందిస్తూ, ముస్లిం బాలికలకు విద్యను నిరాకరించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు.  ఈ నేపథ్యంలో ఎంఈఏ ఈ వివరణ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు గురువారం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో పాఠశాలల్లోని తరగతి గదుల్లో మతపరమైన వస్త్రాలను ధరించవద్దని తెలిపింది.
హిజాబ్, కాషాయ కండువాలు, జెండాలు వంటివాటిని తరగతి గదుల్లో ధరించరాదని చెప్పింది. విద్యా సంస్థలను తిరిగి తెరవాలని, విద్యార్థులను తరగతులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.