`హిజాబ్’పై అత్యవసర విచారణకు `సుప్రీం’ నిరాకరణ!

కర్ణాటక హిజాబ్‌ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొంది. విద్యా సంస్థలు తెరవచ్చునని, అయితే మతపరమైన దుస్తులను ధరిచరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయొద్దని.. సరైన సమయంలో దీనిపై చర్చిస్తామని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సూచించారు. ఈ కేసు దీర్ఘ కాల పరిణామాలను కలిగి ఉందని, 10 సంవత్సరాలుగా విద్యార్థులు హిజాబ్‌ ధరిస్తున్నారంటూ.. విచారణకు న్యాయవాది ఒత్తిడి తీసుకురాగా.. ‘ ఈ విషయాన్ని పెద్దదిగా చేయవద్దని కోరారు. 

“హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. ఈ సమస్యను జాతీయ స్థాయికి.. అంటే ఢిల్లీ వరకు తీసుకురావడం సమంజసమేనా? ఏదైనా తప్పు జరిగితే.. మేం జోక్యం చేసుకుంటాం’ అని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు.

ఇదే పిటిషన్​పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్​ అభ్యర్ధించారు. 

ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్​ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ రమణ  పేర్కొన్నారు.