విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్‌ అవసరం లేదు

దేశంలో కరోనా కొంతమేర అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతోంది. దీంతో విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. 

విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్‌ను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రయాణికులు దేశానికి వచ్చిన అనంతరం 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలని సూచించింది. 

ప్రారంభంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కెనడా, హాంగ్‌కాంగ్‌, అమెరికా, బ్రిటన్‌, బహ్రెయిన్‌, కతార్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కొన్ని యూరప్‌ దేశాలను ‘ఎట్‌-రిస్క్‌’గా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కేటగిరీని తొలగించింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశయ్రాల్లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను పూర్తి చేయాలని తెలిపింది. ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. లేదా, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. 

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చి, నెగెటివ్‌ పత్రం లేదా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ అప్‌లోడ్‌ చేసిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానంలోకి ఎక్కించుకోవాలి.

ప్రయాణికులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలి. ప్రయాణంలో ప్రయాణికులెవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు చెబితే వారిని ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌లో ఉంచాలి.