ఎల్ఐసీ చేతిలోని షేర్ల విలువ రూ. 9.5 లక్షల కోట్లు

భారత జీవిత భీమా సంస్థ (ఎల్​ఐసీ) చేతిలోని షేర్ల విలువ  డిసెంబర్​ త్రైమాసికం  చివరి నాటికి రూ. 9.53 లక్షల కోట్లు. అంతకు ముందు త్రైమాసికం​తో పోలిస్తే ఈ విలువ 1.46 శాతం ఎక్కువైనట్లు ప్రైమ్​ డేటాబేస్​ అధ్యయనం వెల్లడించింది. ఎన్​ఎస్​ఈలో లిస్టింగ్​ పొందిన 278 కంపెనీలలో ఒక శాతం కంటే ఎక్కువే ఎల్​ఐసీ చేతిలో ఉన్నట్లు పేర్కొంది.

ఈక్విటీ పెట్టుబడులలో ఇన్సూరెన్స్​ కంపెనీల వాటా చూస్తే 77 శాతంతో ఎల్​ఐసీనే ముందు వరుసలో ఉంది. డిసెంబర్​ 2021 చివరి నాటికి ఐడీబీఐ బ్యాంకులో ఎల్​ఐసీకి 49.24 శాతం, ఎల్​ఐసీ హౌసింగ్​ ఫైనాన్స్​లో 45.24 శాతం వాటాలు ఉన్నాయి.

ఐటీసీలో 16.21 శాతం, హిందుస్థాన్​ కాపర్​లో 14.22 శాతం, ఎన్​ఎండీసీలో 14.16 శాతం, ఎంటీఎన్​ఎల్​లో 13.12 శాతం, ఎల్​ అండ్​ టీలో 12 శాతం, ఆయిల్​ ఇండియాలో 11.85 శాతం వాటాలు ఎల్​ఐసీ చేతిలో ఉన్నాయి.

విలువపరంగా చూస్తే రిలయన్స్​ ఇండస్ట్రీస్​లో ఎల్​ఐసీకి ఉన్న షేర్ల విలువ రూ. 95,274 కోట్లు. టీసీఎస్​, ఇన్ఫోసిస్​లు రెండింటిలోనూ కలిపి ఎల్​ఐసీ షేర్ల విలువ రూ. 95,488 కోట్లు. డిసెంబర్​ క్వార్టర్లో పవర్​ గ్రిడ్, డ్రెడ్జింగ్​ ఇండియా, కంప్యూటర్​ సర్వీసెస్​, కోఫోర్జ్​, దీపక్​ నైట్రైట్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ వంటి కంపెనీలలో తన వాటాను ఎల్ఐసీ పెంచుకుంది.

మరోవైపు ఐఆర్​బీ ఇన్​ఫ్రా, ఏబీబీ ఇండియా, హిందుస్థాన్​ మోటార్స్, స్టెర్లైట్​ టెక్నాలజీస్​, హెచ్​ఏఎల్​, బాంబే డైయింగ్​ వంటి కంపెనీలలో తన వాటాను తగ్గించుకుంది.

ఎల్​ఐసీలో తనకున్న నూరు శాతం వాటాలో 5 శాతం మాత్రమే ఐపీఓ ద్వారా అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వంకు  మొత్తం 6.32 బిలియన్​ షేర్లుండగా, ఇందులో 316 మిలియన్​లు మాత్రమే అమ్మాలనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

సంప్రదింపులు చివరి దశలో ఉండటంతో, ఇందులో కొంత మార్పు ఉండే అవకాశం​ కూడా ఉందని పేర్కొన్నాయి. ఎల్​ఐసీ ఎంబెడ్డెడ్​ విలువను రూ. 5.4 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. బుక్​ బిల్డింగ్​ పద్ధతిలో షేర్​ విలువను లెక్కకడతారు. డిజిన్వెస్ట్​మెంట్​ టార్గెట్​ చేరుకోవడానికి ఎల్​ఐసీ ఐపీఓను మార్చిలోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.

ఎల్​ఐసీ ఐపీఓకి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఐఆర్​డీఏ) ఆమోదం లభించింది. దీంతో గురువారం సెబీ వద్ద డ్రాఫ్ట్​ ప్రాస్పెక్టస్​ ఫైల్​ చేయడానికి ఎల్​ఐసీకి వీలవుతుంది. ఎల్​ఐసీ ఐపీఓ సైజు రూ. 70 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ లెక్కన చూస్తే లిస్టింగ్​ తర్వాత ఎల్​ఐసీ మార్కెట్​ వాల్యూ రూ. 13–15 లక్షల కోట్ల మధ్యలో ఉండచ్చన మాట. 

ఐపీఓలో  పాలసీ హోల్డర్లకు 5 శాతం డిస్కౌంట్​​ఇవ్వాలని ఎల్​ఐసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. రిటెయిల్​ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకూ కూడా కొంత రాయితీ  ఇవ్వనుంది. ఎల్​ఐసీలో ప్రస్తుతం 100 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. కంపెనీ వద్ద లైఫ్​ ఇన్సూరెన్స్​ తీసుకున్న పాలసీ హోల్డర్లు 29 కోట్ల మంది. లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​కి 2,048 బ్రాంచ్​ ఆఫీసులు, 8 జోనల్​ ఆఫీసులు, 113 డివిజనల్​ ఆఫీసులు, 11.48 లక్షల మంది ఏజంట్లు ఉన్నారు.