అంటరానితనం గోడలు కూల్చిన రామనుజాచార్యులు

రామనుజాచార్యులు అసమానత్వపు గోడలు కూల్చారని,  వెనుకబడినవారిని పూజారులుగా చేశారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలలో  కుటుంబసమేతంగా సమతామూర్తి కేంద్రాన్ని గురువారం సాయంత్రం దర్శించుకున్న ఆయన అంటరానితనంపై రామనుజాచార్యులు గళమెత్తారన్నారని కొనియాడారు.
లింకన్ వంటి వారు కూడా సమానత్వం కోసం కృషి చేశారని చెబుతూ సమాజంలో అందరూ సమానమే అని చిన్నజీయర్ స్వామి చాటుతున్నారని ప్రశంసించారు. ఆది శంకరచార్యులు సనాతన ధర్మం కోసం అపారమైన కృషి చేశారని గుర్తు చేశారు. ప్రవచన మందిరంలో ప్రసంగించిన రాజ్ నాథ్ సింగ్   శ్రీరామనగరంలోని 216 అడుగుల సమతా మూర్తి ప్రతిమను ఒక మహా విగ్రహంలా కాకుండా, రామనుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.  రామనుజాచార్యులు, శంకరాచార్యులు, మద్వాచార్యులూ హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారనీ ఆయన తెలిపారు. ఈ ప్రపంచంలో అందరూ సమానమేనని, ఎవరూ ఎక్కువా కాదూ, ఎవరూ తక్కువా కాదనీ చినజీయర్ స్వామి చాటిచెప్పడం అభినందనీయమని రక్షణ మంత్రి కొనియాడారు. వెనుకబడినవారికి విద్యాబోదనలు చేసి పూజారులుగా చేశారనీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. 
తనకు గురువు చెప్పిన ముక్తిమంత్రాన్ని గుప్తంగా పెట్టకుండా అందరి ముందూ ఆలపించారని గుర్తు చేశారు. తాను నరకానికి వెళ్లినా ఫర్వాలేదని.. వేలాది మందికి ముక్తి లభిస్తే చాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని  రాజ్‌నాథ్‌ తెలిపారు. లోకకళ్యాణం కోసం హిందువుల ఐక్యత కోసం రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు
అనంతరం యాగశాలలో రాజ్ నాథ్ సింగ్ లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. అటునుంచి ఎలక్ట్రిక్ వాహనంలో చినజీయర్ స్వామితో కలిసి ప్రవచన మండపానికి వచ్చిన ఆయన, అక్కడ జరుగుతున్న వందనా రాజేంద్రకుమార్ సంగీత కార్యక్రమాన్ని తిలకించారు. ఉత్సవంలో భాగంగా గురువారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటూ ఆంథ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడైన పండిట్ గురుదేవ్ రవి శంకర్‌, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లు కూడా పాల్గొన్నారు.
1000  సంవత్సరాల  క్రింద దేవాలయాల తలుపులు..  అన్నీ కులాల వాళ్ళ కోసం  తెరిచి రామానుజ చార్యులు సమానత్వం చాటారని ఆధ్యాత్మిక గురువు రవి శంకర్ చెప్పారు.  నేటి తరం వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలని పేర్కొన్నారు. ముచ్చింతల క్షేత్రం భవిష్యత్తులో పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం శభపరిణామమని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాశీలో మహదేవుడి ఆలయ పునరుద్ధరించడం, అయోధ్యలో రామ మందిరం పునర్‌ నిర్మిస్తుండటం ద్వారా హిందూ ధర్మం పట్ల తమకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారని పేర్కొన్నారు . దేశం గర్వపడేలా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.  రాజ్‌నాథ్  మార్గనిర్దేశంలో భారత ఆర్మీ మరింత శక్తివంతంగా తయారైందని కొనియాడారు.