సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దాం!

సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దామని చిన్న జియ్యర్ స్వామి పిలుపిచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలలో భాగంగా సామాజిక నేతల జాతీయ సమావేశంలో సందేశం ఇస్తూ 
  ప్రతి వ్యక్తిలోనూ కొన్ని సామర్థ్యాలు ఉంటాయని చెప్పారు. వ్యక్తిలోని లోపాలను చూసి పరిహసించడం కాకుండా,అతని లోని గుణాలను సమాజ హితం కోసం ఉపయోగ పడేట్లు చేయాలని ఉద్భోధించారు.
ప్రతి వ్యక్తిలోని గుణ, గణాల వికాసం కోసం సంపూర్ణ సమాన అవకాశాలను అందరికీ కల్పించాలని సూచించారు.  అస్పృశ్యత పేరున సమాజానికి దూరంగా ఉంచబడిన వర్గాల ప్రజలను హరిదాసులు గా తీర్చి దిద్ది, వారికి సమాజంలో గౌరవ స్థానం కల్పించిన ఘనత సమతా మూర్తి శ్రీ రామానుజుల  వారని గుర్తు చేశారు.
మన మన సామర్ధ్యాలతో తేడాలున్నా అయిదు వేళ్ళు కలసి పని చేసి నట్లు మనమందరం అందరి మేలు కోసం కలసి పని చేయాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా నివసిస్తున్న గిరిజన బాలురను చక్కటి వాతావరణంలో విద్య అవకాశాలను మనం వారికి కల్పించినప్పుడు వారు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావడం మనం నడుపుతున్న పాఠశాలల్లో చూసామని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి 169 మంది ప్రతినిధులు,ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇందులో సగం మంది ఎస్సీలు కాగా,మిగిలిన సగం మంది వివిధ కులాల వారు ఉన్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్,మహాత్మా జ్యోతి బా ఫూలే,సంత్ రవిదాస్,వాల్మీకి వంటి సమత కోసం పనిచేసిన మహా పురుషుల జయంతులను అన్ని వర్గాల ప్రజలు నిర్వహించు కోవాలని నిర్ణయించారు. 
 
ఉన్నత కులాలుగా తమను భావించుకునే ప్రజలలో సామాజిక సమత తో కూడిన వ్యవహారాన్ని ఎలా కల్పించాలి? భారత రాజ్యాంగం అందించిన సమాన హక్కులను నిమ్న వర్గాల ప్రజలకు చేరేట్లు చేయడంలో మన పాత్ర ఏమిటి? వంటి వివిధ విషయాలపై జరిగిన చర్చను ఆర్ ఎస్ ఎస్ జాతీయ కార్యకారిని సభ్యులు  భాగయ్య  నిర్వహించారు. 
 
చిలుకూరి బాలాజీ అర్చకులు డా. రంగరాజన్  “మునివాహన సేవ” కార్యక్రమాన్ని తాను ఎందుకు నిర్వహించిందీ? దాని ప్రభావాన్ని తెలిపారు.