విద్యార్థులెవరూ మతపరమైన దుస్తులు ధరించరాదు 

రాష్ట్రంలోని కళాశాలలను తెరుచుకోవచ్చని,  అయితే, ఈ సమస్య పరిష్కారమయేంత వరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించరాదని కర్ణాటక హైకోర్టు  స్పష్టం చేసింది. 
 
తమ విచారణ పూర్తయి ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చే వరకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన ఆ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే శాంతి, సామరస్యాలు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
 
విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి మాట్లాడుతూ.. ఈ సమస్య కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థులెవరూ తమ మతాచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ కోసం కోర్టు చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసింది.
 
కర్ణాటకలో హిజాబ్ వివాదం గతేడాది డిసెంబరులో మొదటిసారి వెలుగుచూసింది. ఉడుపిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీనికి నిరసనగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ గొడవ మరింత ముదిరి హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. 
 వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. 
 
కాగా, . కాగా విద్యాలయాల్లో యథాతథ స్థితిని కొనసాగిస్తూ.. శుక్రవారం నుంచి వాటిని తిరిగి తెరవాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హిజాబ్‌, కాషాయ కండువాలను స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించరాదన్న త్రిసభ్య బెంచ్‌ మధ్యంతర ఆదేశాల అమలుపై ముఖ్యమంత్రి బొమ్మై గురువారం అధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
తొలి దశలో సోమవారం (14వ తేదీ) నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను అనుమతించాలని, ఆ పై తరగతులకు సంబంధించి మాత్రం తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ విషయమై మంత్రులతో సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీసు అధికారులు కూడా హాజరవుతారు.
మరోవంక, కర్నాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై నడుస్తున్న కేసులను సుప్రీంకు బదిలీ చేసుకోవాలని దాఖలయిన పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం లిస్టింగ్ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుతం కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున .. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్‌కు సూచించింది. 
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో ఉన్న కేసులను బదిలీ చేసుకోవడంతో పాటుగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.