క్రిప్టో కరెన్సీ నిషేధంపై నిర్ణయం తీసుకోలేదు 

క్రిప్టో కరెన్సీలావాదేవీలనుంచి వచ్చే లాభాలపై పన్ను విధించే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే వాటిని నిషేధించాలా.. వద్దా అన్నదానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 
 
బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఆమె క్రిప్టో పన్ను అంశాన్ని ప్రస్తావించారు. ‘క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చట్టబద్ధమా .. కాదా అన్న ప్రశ్న తర్వాత. కానీ ఆ లావాదేవీలద్వారా పొందే లాభాలపై పన్ను విధిస్తాం. ఎందుకంటే అది ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమ హక్కు’ అని పేర్కొన్నారు. 
 
క్రిప్టో కరెన్సీలపై నిపుణులతో సంప్రదింపులు అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీలను నిషేధించాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇప్పుడే దానిపై ఎలాంటి చర్యలు చేపట్లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 
ఈ నెల 1న ప్రవేశపెట్టిన 2022 23 కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ లావాదేవీలను చట్టబద్ధం చేసినట్లే అని మదుపర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ  స్పష్టత ఇచ్చారు.
 
కాగా, కేంద్ర బడ్జెట్‌లో పేదప్రజలను వదిలేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు నిర్మలా సీతారామన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఏడేళ్ల క్రితం 2013లో ‘పేదరికం’ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలపై ధ్వజమెత్తారు.
 
‘పేదరికం అనేది కేవలం మానసిక స్థితి అని అన్నారు కదా.. దాని గురించి మాట్లాడాలా?’ అని రాహుల్‌గాంధీనుద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. బడ్జెట్‌లో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ప్రస్తావించిన ఆమె ‘ మానసిక పేదరికం గురించి మాట్లాడాలా.. కాస్త స్పష్టంగా చెప్పండి’ అని ఎద్దేవా చేశారు. 
 
దీనికి శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది అభ్యంతరం తెలిపారు. ఆర్థిక మంత్రి పేదలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నేను పేదలను ఎగతాళి చేయడం లేదు. పేదలను అపహాస్యం చేసిన వారితోనే మీ పార్టీ పొత్తు పెట్టుకుంది’ అంటూ ధ్వజమెత్తారు.
“మీ (కాంగ్రెస్‌పార్టీనుద్దేశిస్తూ) మాజీ అధ్యక్షుడు గతంలో పేదరికానికి కొత్త అర్థం చెప్పారు. ‘పేదరికం అంటే దుస్తులు, తిండి, డబ్బు లేకపోవడం కాదు.. అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే. ఆత్మ విశ్వాసంతో దాన్ని అధిగమించవచ్చు’ అని ఆయన అన్నారు. ఆ పేదరికం గురించే మాట్లాడమంటారా?”అంటూ ఆర్థిక మంత్రి ఎద్దేవా చేశారు.
ఇక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ‘2014నుంచి భారత్ రాహుకాలంలో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలకు కూడా నిర్మలా సీతారామన్ దీటుగా సమాధానమిచ్చారు. ‘2013లో మీ ( కాంగ్రెస్) సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్‌ను మీడియా ముందు చించేసిన రోజు రాహుకాలం ఉంది’ అని దుయ్యబట్టారు.
 
కాగా, ఈ ఏడాది బడ్జెట్‌ లక్ష్యం ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కోలుకోవడమేనని ఆమె  చెప్పారు.”రాబోయే 25 ఏళ్లు భారతదేశానికి ముఖ్యమైనవి. భారతదేశం కోసం ఒక విజన్‌ కలిగి ఉన్నాం. 65 సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని ఆదుకోవడం, నిర్మించడం, ప్రయోజనం పొందడం తప్ప ఎటువంటి దృక్పథం లేదు” అని ధ్వజమెత్తారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి, సుస్థిరత సాధించడానికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని ఆమె భరోసా వ్యక్తం చేశారు.