రైతుల కోసమే సాగు చట్టాలు… దేశ హితం కోసమే రద్దు!

రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, దేశం హితం కోసం వాటిని వాటిని ఉపసంహరించుకున్నట్లు ఆయన చెప్పారు. 
 
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్ కు ముందు ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎల్లప్పుడూ రైతుల ప్రయోజనాల కోసం పనిచేశానని, వారు కూడా తనకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై ఇక వివరించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని చెబుతూ తాము ఎందుకీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో భవిష్యత్‌లో మరింత బాగా తెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
 “నేను రైతుల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయాణం చేస్తున్న వ్యక్తిని. సన్నకారు భూములతో ఉన్న రైతుల బాధలను నేను అర్థం చేసుకున్నాను. నేను ఎల్లప్పుడూ వారి హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అని ప్రధాని మోదీ వివరించారు. 
 
అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ధీమా

ప్రస్తుతం జరుగుతున్న మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఎల్లప్పుడూ స్థిరత్వంతో పనిచేస్తుందని, అధికార వ్యతిరేకతకు బదులుగా అధికార అనుకూల వాతావరణంతో స్వాగతం పలుకుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
ఈ ఎన్నికల్లో  తాము (బీజేపీ) సంపూర్ణ ఆధిక్యతతో గెలుస్తామని పేర్కొంటూ తాము అధికారంలో ఉన్నపుడు గొప్ప శక్తి సామర్థ్యాలతో, విస్తృత స్థాయిలో ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం’’ పని చేస్తామని తెలిపారు.
 
కాగా, అనేకసార్లు పరాజయాలను చవి చూసిన తర్వాతే బీజేపీ గెలిచిందని ప్రధాని గుర్తు చేశారు. తాము గెలిచినపుడు క్షేత్ర స్థాయిలో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని,  మనసులను గెలుచుకోవడం కోసం వచ్చే అవకాశాలను వదిలిపెట్టబోమని చెప్పారు. 
“వంశపారంపర్య రాజకీయాలు”పై తీవ్ర దాడిని ప్రారంభించిన మోదీ,  ఇది “పెద్ద ముప్పు”, “ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు” అని పేర్కొన్నారు. ఎన్నికలు జరగనున్నఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీపై తన “నకిలీ సమాజ్‌వాదీ” అభిశంసన గురించి వివరిస్తూ, ఈ పార్టీలు కేవలం “పరివారం” గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. 
 
 పార్లమెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాను. ఎవరి తండ్రిని, తాతను కించపర్చలేదని ప్రధాని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని అన్న వ్యాఖ్యలనే  తాను చెప్పానని,  అప్పటి పరిస్థితులను..ఇప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశానని మోదీ తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అక్కడ అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. 
 
గత ప్రభుత్వాలు అభివృద్ధిపై ఏ రోజు దృష్టి పెట్టలేదని ప్రధాని విమర్శించారు. అప్పటి ప్రభుత్వాలు ఫైళ్లపై సంతకాలతో నడిచేవని..సొంత మనుషులకే లబ్ధి చేకూర్చారని ధ్వజమెత్తారు. కొందరు విభజించు పాలించు పాలసీ అమలు చేశారని మండిపడ్డారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరిలను ప్రస్తావిస్తూ, ఈ ఇద్దరి ఆట చాలా పాతదేనని చెప్పారు. ఇద్దరబ్బాయిల ఆటను గతంలో కూడా చూశామని పేర్కొన్నారు. ‘రెండు గుజరాతీ గాడిదలు’ అని వారు గతంలో అన్నారని, అందుకు వారికి ఉత్తర ప్రదేశ్ గుణపాఠం చెప్పిందని తెలిపారు. మరోసారి ఇద్దరబ్బాయిలు, ఓ బువాజీ కలిశారని, అయినప్పటికీ వారికి కలిసిరాలేదని ఎద్దేవా చేశారు. 
ప్రజలకు సేవ చేయడమే సామ్యవాదం 
పేదలకు సేవ చేయడం, వారికి మౌలిక వసతులు కల్పించడమే సోషలిజం అయితే దాన్ని తాను అంగీకరిస్తానని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అయితే కుటుంబ-వారసత్వ రాజకీయాన్ని సమర్ధించనని స్పష్టం చేశారు.
‘‘ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. ప్రభుత్వాల్లో ఉన్నవారు కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పేదలకు ఆహారం అందిచడం, ఇళ్లు నిర్మించడం, టాయిలెట్లు నిర్మించడం, తాగునీరు అందిచడం, ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు మౌలిక వసతులైన రోడ్లు నిర్మించడం, రైతుల గురించి ఆలోచించడం లాంటివి చేయాలి” అని ప్రధాని సూచించారు. తన  ప్రాధాన్యతలో ఇవే ఉన్నాయని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండాలని పేర్కొంటూ. ప్రస్తుత పరిస్థితుల్లో యువత బీజేపీకి రావడం తప్ప మరో పార్టీలో చేరలేని పరిస్థితి ఉందని ప్రధాని తెలిపారు.  దీనికి కారణం ఒక్క బీజేపీ మాత్రమే ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తోందని, తమ పార్టీలో మాత్రమే యువత ఎదగడం సాధ్యమని మోదీ  చెప్పారు.

జనవరిలో లూథియానా-ఫిరోజ్‌పూర్ హైవేలో తన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్యంపై మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ, ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రారంభించిన దర్యాప్తుపై తన వ్యాఖ్యలు ప్రభావం చూపవచ్చని చెప్పారు.