తమ జోలికి ఎవరైనా వస్తే హిందువులు పోరాడాల్సిందే

హిందూ ధర్మం నిలవాలంటే అందుకోసం పోరాడి గెలవాలని ఆర్‌ఎ్‌సఎస్‌ సర్ సంఘచాలక్కే  డా. మోహన్  భాగవత్‌ పిలుపిచ్చారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో మోహన్‌ భాగవత్‌ బుధవారం సాయంత్రం పాల్గొంటూ ప్రవచన మండపంలో జరిగిన ధర్మాచార్య సభలో ఆయన ప్రసంగించారు.

హిందువులు తమకు తాముగా ఎవరి జోలికీ వెళ్లరని, మన జోలికి ఎవరైనా వస్తే మాత్రం పోరాడాలని స్పష్టం చేయసారు. అప్పుడే ధర్మ రక్షణ, హిందూ సంప్రదాయాల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. మన పురాణాలు సమానత్వాన్ని నేర్పించాయని, మన ధర్మాలు, పురాణాలు మనకు నేర్పింది సమతా భావమేనని ఆయన పేర్కొన్నారు.

మన మంచితనాన్ని అమాయకత్వంగా భావించి కొంత మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సమాజంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను నడుపుతోంది హిందువులేనని స్పష్టం చేశారు.  ఈ దేశంలో హిందువులు 80 శాతం ఉన్నారని, హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికీ లేదని పేర్కొన్నారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లగలిగే చినజీయర్‌స్వామిలాంటి వారి అవసరం ఉందని ఆయన చెప్పారు. ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక క్షేత్రం ఏర్పాటుతో భాగ్యనగరం పేరు సార్థకమైందని కొనియాడారు. మనకు విభిన్న సంప్రదాయాలు ఉన్నా ఒకే ధర్మ మార్గంలో ముందడుగువేయాలని పిలుపునిచ్చారు.

వెయ్యేళ్ల నుంచి ఎన్నో దండయాత్రలను ఎదుర్కొన్న చరిత్ర హిందూమతానిదని చెబుతూ సనాతన ధర్మం ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని తెలిపారు.  మనం వసుధైక కుటుంబం అని అనుకుంటున్నాం కానీ అంతటా అలా లేదని భగవత్ గుర్తు చేశారు. హిందూ మతాన్ని దెబ్బతీయాలనుకున్నవాళ్లే దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. హిందూ సమాజం ఇతరులతో శతృత్వం పెట్టుకోదని స్పష్టం చేశారు.

వెయ్యేళ్ల కిందటే భేదాలు తొలగిపోవాలని శ్రీరామానుజాచార్యులు చెప్పినా నేటికీ వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అంతకు ముందు మోహన్‌ భాగవత్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ ముఖ్య నేత భయ్యాజీ జోషి కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

కాగా, సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఉండడం దురదృష్టకరమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. కులాల మధ్య ఆధిపత్య పోరుతో విద్వేషాలు మరింత పెరిగే ముప్పు ఉందని హెచ్చరించారు. 
 
చిన జీయర్‌స్వామి ప్రవచనం వింటే రాజకీయ నాయకులు మరిన్ని మెరుగైన ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుందని శివరాజ్‌సింగ్‌ అభిలాష వ్యక్తం చేశారు. లోకకల్యాణం కోసం ఆయన చెప్పే మాటలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలిపారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.

భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీపై ప్రశంసలు కురిపిస్తూ  లోకకల్యాణానికి చిన్నజీయర్ స్వామీజీ శ్రీకారం చుట్టారని కొనియాడారు.  మానవుల్లో ఉన్న అసమానతలు అనే వైరస్‌ను తొలగించి సమతను పెంపొందించేందుకే సమతా మూర్తి విగ్రహాన్ని  త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఏర్పాటు చేశారని తెలిపారు.