ముస్లిం మహిళలకు యుపిలో బిజెపి ప్రభుత్వం అవసరం  

ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకుండా చూడటానికి ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 

శాసన సభ ఎన్నికల ప్రచారంలో, కరోనామహమ్మారి ఆంక్షల నేపథ్యంలో, తొలిసారి సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూబీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి చేసిందని గుర్తు చేశారు. 

ముస్లిం మహిళలు తన ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించడంతో ప్రత్యర్థులు ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ప్రతి ముస్లిం మహిళకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.  ముస్లిం కుమార్తెల జీవితం ఎప్పుడూ వెనుకబడి ఉండేలా ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు  ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారని మోదీ విమర్శించారు.

ప్రతిపక్షాలు తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తాయని, అంతకుమించి అవి చూడలేవని ప్రధాని ధ్వజమెత్తారు. ఆ పార్టీలు ప్రజలను పట్టించుకోవని చెబుతూ కరోనా మహమ్మారి సమయంలో ఆ పార్టీలు అధికారంలో ఉండి ఉంటే, దారిలోనే వ్యాక్సిన్లను అమ్మేసుకునేవారని, ప్రజలకు వాటిని చేరనిచ్చేవారని దుయ్యబట్టారు. వ్యాక్సిన్లు ప్రజల వద్దకు చేరి ఉండేవి కాదని స్పష్టం చేశారు. 

 ఎవరైనా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారంటే, అవి శుష్క వాగ్దానాలేనని, బాద్యతా రహితంగా చెప్పే మాటలేనని ప్రధాని తెలిపారు. గత పాలకులు విద్యుత్తును అందుబాటులోకి తెస్తామన్నారని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారని, ఉత్తర ప్రదేశ్‌ను చీకట్లో ఉంచారని ప్రధాని గుర్తు చేశారు. 

అల్లర్లు జరగని రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ఓటు వేయాలని మోదీ ప్రజలను కోరారు. నేరగాళ్ళను జైళ్ళకు పంపించడానికి, మహిళలు నిర్భయంగా జీవించడానికి అవకాశం లభించే విధంగా ఈ శాసన సభ ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు.  

ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో చలిలో కూడా బయటకు వస్తున్న ఓటర్లను మోదీ ప్రశంసించారు. యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సంక్షేమం కోసం దృఢ సంకల్పంగా అభివర్ణించారు. 

పీఎం కిసాన్ యోజన లబ్ధిని నిరంతరం రైతులు పొందాలంటే ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటం చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. చెరకు రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చెరకును ఇథనాల్ ఉత్పత్తి కోసం కూడా వాడతామని తెలిపారు.  ఈ ఇథనాల్ నుంచి రూ.12,000 కోట్లు వచ్చిందని చెప్పారు. 

సమాజ్ వాదీ పార్టీ కుటుంభం రాజకీయాల ద్వారా “నకిలీ సోషలిజం”లో నిమగ్నమైందని కూడా ఆయన ఆరోపించారు. “మీరు లోహియాజీ, జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుటుంబాలను చూడగలరా? వారు సోషలిస్టులు. ఎస్పీ నుండి 45 మంది వ్యక్తులు, కొంత పదవిలో ఉన్నారని నాకు లేఖ వచ్చింది. ఈ వంశపారంపర్యం ప్రజాస్వామ్యానికి ముప్పు” అని ప్రధాని హెచ్చరించారు.