మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ అదృశ్యం!

మేఘాలయ అసెంబ్లీలో 21 మంది సభ్యులతో బలమైన పక్షంగా ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడు ఎవ్వరు మిగలలేదు. గత నవంబర్ లో 12 మంది ఎమ్యెల్యేలను కోల్పోయిన కాంగ్రెస్, తాజాగా మిగిలిన ఐదుగురిని కూడా కోల్పోయింది. దానితో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

బీజేపీ భాగస్వామిగా ఉన్న అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్‌లో (ఎండీఏ) ఐదుగురు చేరిపోయారు. నేరుగా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మాను కలిసి తామంతా కూటమి ప్రభుత్వంలో లాంఛనంగా చేరినట్టు ఒక లేఖను సమర్పించారు. వీరికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు.

”ప్రభుత్వం, ప్రభుత్వ విధానాల పటిష్టతకు మీతోనూ, ఎండిఏ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలు సాకారమవుతాయని విశ్వసిస్తున్నాం” అని ఐదుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మెమొరాండంను సీఎంకు సమర్పించారు.

నాగాలాండ్, త్రిపుర సహా మేఘాలయలో 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలవగా, ఆ తర్వాత 17కు పడిపోయింది. వారిలో 12 మంది గత ఏడాది నవంబర్‌లో టీఎంసీలో చేరారు. తక్కిన ఐదుగురు తాజాగా అధికార ఎండీఏ కూటమిలో చేరిపోయారు.