తెలంగాణలో ముగిసిన మూడో వేవ్…. కరోనా ఆంక్షలు లేవు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. జనవరి 28న కరోనా మూడో వేవ్ కీలక దశకు చేరుకోగా, రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2 కంటే తక్కువగా ఉందని చెప్పారు. 4 శాతం  ఆస్పత్రి పడకలు మాత్రమే నిండాయని చెబుతూ ఇక మూడో వేవ్ ముగిసిన్నట్లే అని తెలిపారు. 

మొదటి వేవ్ వల్ల దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డామని, మూడో వేవ్ దాదాపు ఆరు నెలలు ఉందని పేర్కొన్నారు. మూడో వేవ్  28 రోజుల్లోనే  అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. తెలంగాణ కరోనాను  సమర్ధంగా ఎదుర్కొంటోందని చెబుతూ  తెలంగాణలో నిర్వహించిన ఫీవర్ సర్వే సత్ఫలితాలు వచ్చాయన్నారు.  కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసిందని తెలిపారు. 

కరోనా మూడో వేవ్ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని చెప్పారు. మూడో వేవ్ లో  టీకా తీసుకొని వారు 2.8 మంది  మంది ఆస్పత్రి పాలయ్యారని, 31లక్షల  నిర్ధారణ పరీక్షలు చేసామమని వివరించారు. మూడో వేవ్‌లో జనవరి 25న అత్యధికంగా 4800 కేసులు నమోదు అయ్యాయన్నారు.  మూడో వేవ్ లో కేవలం 3000 మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారని చెప్పారు. 

మూడో వేవ్ ఫీవర్ సర్వే లో 4 లక్షల మందికి కరోనా కిట్‌లు అందించామని తెలిపారు. కరోనా క్షీణించడంతో ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.  అన్ని సంస్థలు 100 శాతం పని చేయొచ్చని తెలిపారు.

ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చని డీహెచ్ తెలిపారు. ఐటి పరిశ్రమ సైతం వర్క్ ఫ్రమ్   హోమ్ తీసివేయవచ్చని చెబుతూ ఇక దానిని విరమించాలని శ్రీనివాసరావు కోరారు. 

ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. కేసులు తగ్గినా ఫీవర్ సర్వే కొనసాగుతుందని చెప్పారు.  కరోనాను సీజనల్ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాస్ వెల్లడించారు.