బీజేపీ యుపి మేనిఫెస్టో విడుదల వాయిదా

 
 ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర’ విడుదల వాయిదా పడింది. దీనిని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ఆదివారం ఉదయం 10.15 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించవలసి ఉంది. 
ఈ కార్యక్రమం కోసం అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యారు. కానీ మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసి, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ ఎన్నికల ప్రణాళికను ఎప్పుడు విడుదల చేస్తారో తర్వాత ప్రకటిస్తారు.
స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ, లతా మంగేష్కర్ వంటివారు శతాబ్దాలకు ఒకసారి జన్మిస్తారన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసే తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి పునాది వేసింది ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని భాగ్‌పట్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొంటూ  బీఎస్పీ, ఎస్పీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. 
 బీజేపీ వచ్చిన తర్వాతనే రాష్ట్రాభివృద్ధి ప్రారంభమైందని చెబుతూ  అందుకు నిదర్శనం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణమని చెప్పారు.  70 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని 1.82 కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదు. కానీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక వారికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు.
 రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పట్ల ప్రధాని మోదీకి గొప్ప విజన్ ఉందని పేర్కొంటూ   ఆ విజన్ నుంచి వచ్చినవే గంగా ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ హైవే, ఈస్టర్న్ పెరిఫేరల్ ఎక్స్‌ప్రెస్‌వేలని అమిత్ షా వివరించారు. అంతే కాకుండా ఈ ఎన్నికలు కొందరికి తమ రాజకీయ భవిష్యత్‌లా చూస్తున్నాయని, వాస్తవానికి ఇవి ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించేవని అమిత్ షా స్పష్టం చేశారు.