లతా మృతి పట్ల 2 రోజులు జాతీయ సంతాప దినాలు

‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేస్తారు. ఆమె ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. 
లతా మంగేష్కర్ మృతిపట్ల దేశవిదేశాల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగ్ లతా మంగేష్కర్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
 
 ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో, లతా మంగేష్కర్ మరణంతో  ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలు పగిలినట్లుగానే తన గుండె కూడా చెదిరిందని పేర్కొన్నారు. 
 
అనేక రకాలైన, విస్తృత స్థాయిలోని ఆమె పాటలు భారత దేశ సారాన్ని, సౌందర్యాన్ని ప్రతిఫలింపజేశాయని తెలిపారు. అనేక తరాలు తమ మనసు లోతుల్లోని భావాల వ్యక్తీకరణను గుర్తించాయనే చెబుతూ ‘భారత రత్న’ లతా జీ సాధించిన విజయాలు అనే అని కొనియాడారు. 
 
“కళాకారుడు జన్మిస్తాడు, అయితే శతాబ్దాలకు ఒకసారి. లతా దీదీ ఓ అసాధారణ వ్యక్తి. పరిపూర్ణమైన ఆత్మీయతగల వ్యక్తి. నేను ఆమెను కలిసిన ప్రతిసారీ ఈ విషయాలను గమనించాను. దివ్యమైన గళం శాశ్వతంగా మూగబోయింది. కానీ ఆమె మెలోడీస్ అమరత్వంతో శాశ్వతంగా నిలుస్తాయి. ఆమె కుటుంబ సభ్యులకు, అన్ని చోట్లగల అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని కోవింద్ పేర్కొన్నారు. 
 
 లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశంలో ఎన్నటికీ భర్తీ కానటువంటి శూన్యాన్ని ఆమె వదిలి వెళ్ళారని ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాటల్లో వర్ణించలేనంత ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఇతరుల పట్ల దయ, సంరక్షణ భావాలుగల లత దీదీ మనల్ని వదిలి వెళ్ళిపోయారని విచారం వ్యక్తం చేశారు. 
భారతీయ సంస్కృతి దిగ్గజంగా ఆమెను రానున్న తరాలు గుర్తు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఆమె అద్భుత గళం ప్రజలను సాటిలేని రీతిలో మంత్రముగ్ధులను చేసిందని కొనియాడారు.  ఆమె పాటలు అనేక రకాల భావాలను పలికినట్లు తెలిపారు. భారతీయ సినీ ప్రపంచంలో మార్పులను ఆమె దశాబ్దాలపాటు సన్నిహితంగా చూశారని చెప్పారు. సినిమాలతోపాటు భారత దేశ అభివృద్ధిపట్ల ఆమె నిరంతరం తపించేవారని తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ బలమైన, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూడాలనుకున్నారని చెప్పారు.

‘‘లత దీదీ నుంచి నేను ఎల్లప్పుడూ అమితమైన ఆప్యాయతను పొందడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆమెతో నా సంభాషణలు మరపురానివి. లత దీదీ మరణం పట్ల నా తోటి భారతీయులతో కలిసి దుఃఖిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రగాఢ సంతాపం తెలిపాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. 

 లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలియజేశారు. 
 
ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని, ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం కొనియాడారు. లతా జీ మరణంతో  పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
 
లతా మంగేష్కర్‌ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సంతాపం తెలియజేశారు. ‘లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 
 లతా మంగేష్కర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భారతరత్న లతా మంగేష్కర్ మృతి విచారకరమని అన్నారు. ఆమె తన గాత్రంతో కోట్లాది మందిని అలరించారని కొనియాడారు. లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని చంద్రబాబు అన్నారు.