ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ  ఐఎస్‌ఐఎస్‌ (ఐసిస్‌) అధినేత  అధినేత అబు ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌- ఖురేషిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు ఖురేషీని సిరియాలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు.
 
 ‘గత రాత్రి నా దిశానిర్దేశం మేరకు యూఎస్‌ సైనిక దళాలు తీవ్రవాద నిరోధక చర్యను విజయవంతంగా చేపట్టాయి. మా సాయుధ దళాల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. మేము ఐసిస్‌ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని యుద్ధభూమిలో మట్టుబెట్టాము’ అంటూ జో బైడెన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
 కాగా సైనిక బలగాలు చుట్టిముట్టగానే ఖురేషి తనను తాను డిటోనేటర్‌తో పేల్చుకొని తన కుటుంభం సభ్యులతో సహా చనిపోయారని అమెరికా సైనికాధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా మరణించారని అల్‌జజిరా వార్తా సంస్థ ప్రకటించింది. 
 
ఐసిస్‌కు గతంలో నేతృత్వం వహించిన అబు బకర్‌ అల్‌ బాగ్దాదిని కూడా అమెరికా సైనిక బలగాలే మట్టుపెట్టాయి. ఆయన తర్వాత 2019లో ఖురేషిని తమ అధినేతగా ఐసిసి అధికారికంగా ప్రకటించింది.అబూ బకర్‌ను తుదముట్టించిన తర్వాత సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ‘ఆపరేషన్’ ఇదే కావడం గమనార్హం.

బాగ్దాదీ ఎక్కడ, ఎలా అయితే మరణించాడో, ఖురేషీ కూడా అలాగే మరణించాడని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఖురేషీతోపాటు మహిళలు, పిల్లలు సహా అతడి కుటుంబ సభ్యులు మరణించారు. ఖురేషీని అమిర్ ముహమ్మద్ సైద్ అబ్దల్-రహ్మాన్ అల్ మావ్లా అని కూడా పిలుస్తారు.