4 శాతంకు చేరిన అమెరికా నిరుద్యోగ రేట్ 

ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగిత రేటు స్వల్పంగా 0.1 పర్సంటేజీ పాయింట్లు పెరిగి 4 శాతానికి చేరుకున్నట్లు కార్మిక శాఖ  తెలిపింది. డిసెంబరులో 0.3 పర్సంటేజీ పాయింట్లు తగ్గాయి. 2020 ఏప్రిల్‌తో పోలిస్తే గణనీయంగానే తగ్గినప్పటికీ, కరోనా ముందు నాటి పరిస్థితి 3.5 శాతం కంటే ఎక్కువగా వుంది.

65 లక్షలమంది నిరుద్యోగులు పెరిగారు. వీరిలో కూడా శాశ్వత ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య జనవరిలో 16 లక్షలకు తగ్గింది. తాత్కాలికంగా కోల్పోయిన వారి సంఖ్య లక్షా 47వేలు పెరిగి మొత్తంగా 9,59,000కి చేరిందని నివేదిక పేర్కొంది.

వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారుల మండలి మాజీ చైర్మన్‌, హార్వర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ ఫర్‌మన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ, ఉపాధి డేటాపై ఒమిక్రాన్‌ ప్రభావం కనపడేందుకు కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత గణాంకాల వల్ల రాబోయే ఒకటి రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా వుంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. జనవరిలో విశ్రాంత, ఆతిధ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి, వృత్తిపరమైన, వాణిజ్యపరమైన సేవా రంగాల్లో, రిటైల్‌ వాణిజ్యంలో, రవాణా, గోదాముల రంగాల్లో కూడా స్వల్పంగా అవకా శాలు మెరుగయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.

కాగా, అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య తొమ్మిది లక్షలు దాటినట్లు తాజాగా జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. కరోనా న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కారణంగా అమెరికాలో ఇన్‌ఫెక్షన్లు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది.

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా అక్కడ ఐదేళ్ల వయసు గల పిల్లలకూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. రెండు డోసుల ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులో ఉంచనుంది.