దేశానికి సర్వతోముఖ విధాన ఎజెండాగా బడ్జెట్

భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆ దేశానికి సర్వతోముఖ విధాన ఎజెండాగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కొనియాడారు.  మానవ మూలధన పెట్టుబడి, డిజిటైజేషన్‌ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిలో నవ కల్పనలు (ఇన్నోవేషన్స్)పై శ్రద్ధ పెట్టినట్లు ఆమె తెలిపారు. 
నిర్మల సీతారామన్ మంగళవారం రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కరోనా  మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేలా చేయడంపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించారు. హైవేలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు ప్రతిపాదించారు.
మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచి, తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చేయడంపై దృష్టి పెట్టారు. మూలధన వ్యయాన్ని రూ.7.5 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించారు. డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని, క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పన్ను విధించాలని నిర్ణయించారు. కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధం చేయాలని, నూతన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో జరిగిన వర్చువల్ విలేకర్ల సమావేశంలో క్రిస్టలినా జార్జీవా మాట్లాడుతూ, భారత దేశం వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశామని, అయితే అది ఇప్పుడు కాస్త తగ్గిందని, 2022లో భారత్ వృద్ధి రేటు 9 శాతం ఉంటుందని ఆమె చెప్పారు. 2023లో కాస్త ఎక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
నిర్మల సీతారామన్ చెప్పినదానికి పెద్దగా తేడా లేకుండా వృద్ధి రేటు నిలకడగా ఉంటుందని ఆమె తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక  పరిస్థితులు కఠినంగా ఉండటం పెద్ద సమస్య కాబోదని ఇప్పటి వరకు తమ పరిశీలనలో వెల్లడైందని ఆమె చెప్పారు. గతంతో పోల్చినపుడు రేట్లపై ప్రభావం ఎంతమాత్రం ప్రాధాన్యంగలది కాదన్నారుని ఆమె స్పష్టం చేశారు.
 అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు బఫర్స్ ఏర్పాటు కోసం కృషి చేయడమే దీనికి కారణమని ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం సంబంధిత ఒత్తిళ్ళను ఎదుర్కొన్నపుడు వాటంతట అవే భవిష్యత్తు పట్ల జాగ్రత్తతో తెలివైన చర్యలను చేపట్టాయని ఆమె పేర్కొన్నారు.
భారత దేశం స్వల్పకాలిక సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా దీర్ఘకాలిక నిర్మాణపరమైన పరివర్తనకు ఆలోచిస్తుండటం సంతోషకరమని ఆమె కొనియాడారు. ఆర్థిక సాధనాలను ఉపయోగించి వాతావరణ మార్పుల ఎజెండాను ఏ విధంగా వేగవంతం చేయగలమనే అంశంపై కూడా ఈ బడ్జెట్ ఆలోచిస్తోందని ఆమె చెప్పారు.  ఈ బడ్జెట్‌ స్టేట్‌మెంట్‌ను తాను చదివానని, ఇది భారత దేశం కోసం చాలా సర్వతోముఖ విధానపరమైన ఎజెండా అని ఆమె  వివరించారు.