నకిలీ సమాజ్‌వాదీలతో జాగ్రత్త

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే, ప్రజలను ఆకలితో ఉంచుతారని, రైతులకు అందిస్తున్న సాయాన్ని నిలిపేస్తారని ఆయన చెప్పారు. 
 
శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో రచ్చబండలో   ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో తొలి దశలో ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగే పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అల్లర్లకు పాల్పడేవారు, మాఫియా గ్యాంగులు రాష్ట్రంపై పట్టు సాధించేందుకు అనుమతించరాదని ప్రజలు నిర్ణయం తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో మోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరస్థులు, మాఫియాల విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించిందని పేర్కొంటూ ఒకవేళ వారికి అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ప్రజలపట్ల తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని ప్రధాని హెచ్చరించారు. 
 
ఐదేళ్లకు ముందు ఈ మాఫియావాదులు కేంద్రం పథకాల ప్రయోజనాలు పేదలు, దళితులు, వెనుకబడినవారికి అందకుండా చేశారని ప్రధాని విమర్శించారు. వారు కేంద్ర పథకాలు అందకుండా, అవినీతిని నిరోధించకుండా బ్రేకులు వేశారని పేర్కొన్నారు.
 
 “ప్రతిపక్ష పార్టీ సమాజ వ్యతిరేక శక్తులకు టిక్కెట్లు ఇస్తోంది. దాని ఆధారంగా వారి ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కనుక మీరు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయాలని కోరుతున్నాను” అని ప్రధాని చెప్పారు. 
 
“చలి ఎంత విపరీతంగా ఉన్నప్పటికీ బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందే వచ్చి ఓటు వేయండి. ఆ తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేయండి” అని మోదీ  ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి సూచించారు. ‘ఓటు వేసేటపుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ కుటుంబ నాయకత్వంలోని నకిలీ సమాజ్‌వాదీలకు అవకాశం వస్తే, రైతులకు అందుతున్న సాయాన్ని నిలిపేస్తారు. ఈ నకిలీ సమాజ్‌వాదీలు మిమ్మల్ని ఆకలితో ఉంచుతారు’’ అని మోదీ హెచ్చరించారు.
 భద్రత, గౌరవం, సౌభాగ్యాలను కొనసాగించడానికి; హిస్టరీ షీటర్లను బయట ఉంచడానికి, నూతన చరిత్రను సృష్టించడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు.  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడుతోందని కొనియాడారు.
రాష్ట్రంలో చట్టం అమలయ్యేలా యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెబుతూ నేరగాళ్ళు అదుపులోకి వస్తారని ఎవరూ ఊహించలేదని గుర్తు చేశారు. రెట్టింపు వేగంతో పని చేయగలిగే ప్రభుత్వం 21వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్‌కు అవసరమని, కేవలం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ప్రధాని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం అనంతరం అనేకసార్లు ఎన్నికలు జరిగాయని, అయితే  ప్రస్తుత ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధి కొనసాగింపు, సుపరిపాలన, ప్రజలు వేగంగా అభివృద్ధి చెందడం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నట్లు  గుర్తు చేశారు.
వంద  ఏళ్ళలో మానవాళి ఎరుగని విపత్తు కరోనా రూపంలో వచ్చిందని చెబుతూ ఈ సంక్షోభ సమయంలో సైతం తాము డబుల్ ఇంజిన్ డబుల్ ప్రయోజనాలను ప్రజలకు అందేలా చేశామని ప్రధాని చెప్పారు.  మీరట్, ఘజియాబాద్, అలీగఢ్, హాపూర్, నోయిడా జిల్లాల ఓటర్లను ఉద్దేశించి ఈ వర్చువల్ రచ్చబండను బీజేపీ నిర్వహించింది.