25 నుంచి విశాఖలో మిలాన్‌ -2022 నావికాదళ విన్యాసాలు

కరోనా వల్ల వాయిదా పడ్డ మిలాన్‌ -2022 (మల్టీ లిటరల్‌ నేవీ ఎక్సర్‌సైజెస్‌) నావికాదళ విన్యాసాలు ఈ నెల 25 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. 46 దేశాల నుంచి నావికాదళాలు ఈ విన్యాసాల్లో పాల్గోనున్నాయి. ఈ విన్యాసాలకు విశాఖపట్నం తూర్పునౌకాదళం ఆతిథ్యమిస్తోంది. 

ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాలకు అధిపతి (సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ద నేషన్‌) రాష్ట్రపతి దేశీయ నౌకలను సమీక్షించనున్నారు. దీన్నే ప్రెసిడెన్షియల్‌ ప్లీట్‌ రివ్యూ (పిఆర్‌ఎఫ్‌)గా పిలుస్తారు. దీనికి అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని తూర్పునౌకాదళం ఆహ్వానించింది. గతంలో ఐఎఫ్‌ఆర్‌ను తూర్పునౌకాదళం ఘనంగా నిర్వహించింది. 

దేశీయంగా 50 నౌకల సామర్ధ్యాలను, జలాంతర్గాములు, 50 ఎయిర్‌క్రాఫ్ట్‌ల నైపుణ్యాలను సమీక్షించనున్నారు. 46 దేశాలకు భారత నౌకాదళం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. చైనా, పాకిస్తాన్‌ దేశాలకు మాత్రం దేశీయ నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపలేదు.

వివిధ దేశాల మధ్య సౌహార్థ్రభావాలను పెంపొందించడం, పరస్పరం సహకరించుకునే వాతావరణం పెంపొందించుకోవడం కోసం నావికాదళ విన్యాసాలు జరగడం పరిపాటి. ఇతర దేశాల బలం, బలగం, శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుని వ్యూహం రచించుకునే లక్ష్యంతో నేవీ విన్యాసాలు చేపడుతుంటారు. 

మిలాన్‌ అంటే హిందీలో సమావేశం. కూడిక అని అర్థం. ప్రతీ నాలుగేళ్లకోసారి ఈ విన్యాసాలు నిర్వహించడం సర్వసాధారణం. 1995లో తొలిసారిగా మిలాన్‌ విన్యాసాలు జరగ్గా భారతదేశంతో పాటు ఇండోనేషియా, సింగపూర్‌, శ్రీలంక, థాయలాండ్‌ దేశాలు మాత్రమే పాల్గన్నాయి. 

2010 సంవత్సరం వరకూ ఈ విన్యాసాల్లో ఎనిమిది దేశాలే పాల్గనేవి. 2012లో 16 దేశాలు, 2014లో 17 దేశాలు, 2018లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు పాల్గన్నాయి. 

2005 సంవత్సరంలో సునామీ వల్ల మిలాన్‌ రద్దవ్వగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)ల వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ పది సార్లు మిలాన్‌ జరిగింది.