చింతామణి నాటక పుస్తకం నిషేధం లేనప్పుడు నాటక ప్రదర్శనను ప్రభుత్వం ఎలా నిషేధిస్తుందని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. చింతా మణి నాటక ప్రదర్శన నిషేధంపై వైసిపి తిరుగుబాటు ఎంపీ కె.రఘు రామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధ రావుల డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది.
పుస్తకం నిషేధం లేనప్పుడు నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ప్రశ్నించింది. నాటకంలో ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే మొత్తం నాటక ప్రదర్శనను ఎలా నిషేధిస్తా రని నిలదీసింది. నిషేధించడం ప్రాథమికంగా తప్పు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ తరహాలో నిషేధం విధించుకుంటూ పోతే నాటకాలు, సినిమాలు అనేవి ఉండబోవని చెప్పింది.
ఏ వినతిపత్రం ఆధారంగా నిషేధం విధించారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యువజన సర్వీసులు,పర్యాటక, సాంస్కతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ సీఈవో, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడికి నోటీసులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదే అంశంపై నాటక కళాకారులు త్రినాథ్ వేసిన రిట్‌ను న్యాయ మూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. నాటక నిషేధం వల్ల నాటకాలు వేసే కళాకారుల జీవనభృతి దెబ్బతింటుందని చెప్పారు. సినిమాల్లో కూడా అసభ్య సన్ని వేశాలు ఉంటాయని, వాటిని తొలగించాలని కోరాలేగానీ సినిమా ప్రదర్శనే వద్దంటే ఎలాగని ప్రశ్నించారు. విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు