జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు

దేశ విభజనకు కారకుడైన, పాకిస్థాన్ జాతిపితగా భావిస్తున్న మొహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో గుంటూరు నడిబొడ్డులో స్వాతంత్య్రం ముందు నుండి ఉంటున్న ఒక టవర్ ను  ఇంకా కొనసాగించడంపై బిజెపి నాయకత్వం, పలు హిందూ సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగి వచ్చింది. ఎట్లాగైతే ఆ టవర్ కు భారత జాతీయ పతాకంను సూచించే మూడు రంగులను వేశారు. 
 
అయితే, ఆ టవర్ పేరు మార్చడానికి మాత్రం ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. నిజమైన దేశభక్తులెవరూ ఇంకా జిన్నా పేరు కొనసాగించేందుకు ఇష్టపడరని, తక్షణం టవర్‌కు జిన్నా పేరు తొలగించాలని బిజెపి డిమాండ్ చేయడం జాతీయ స్థాయిలో ప్రజల దృష్టి ఆకర్షించింది. పెద్ద చర్చనీయాంశమయింది.
 
గుంటూరు జిల్లా బీజేపీ నేత పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ విషయమై జరిగిన ఆందోళన కార్యక్రమాలు నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు దిగాక తప్పలేదు.  ఈ విషయమై బిజెపి- వైసిపి మెంతుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో నిలబడలేక అధికారపక్షం నాయకులు తలవంచుకొని పరిస్థితి ఏర్పడింది.
జిన్నా పేరు మార్చకపోతే తామే టవర్‌పై జాతీయ జెండా ఎగురవేస్తామని పాటిబండ్ల చేసిన హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వంలో కలవరం కలిగించింది. మొదటి వైసిపి నేతలు ఈ అంశంపైనా ఎంతగా ఎదురు దాడి చేసినా, తమకు మద్దతుగా స్థానిక ముస్లింలను సమీకరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
 

బీజేపీ-టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరు ఎందుకు మార్చులేదని అంటూ మంత్రి వెల్లంపల్లి తదితరులు ఎదురుదాడి చేసినప్పటికీ, బీజేపీ తెరపైకి తెచ్చిన సెంటిమెంటును మాత్రం పక్కదారి మళ్లించలేకపోయారు.దీనితో గుంటూరు కార్పొరేషన్‌లో పాలక వైసీపీ వస్తాదులు మధ్యేమార్గాన్ని ఎన్నుకున్నట్లు కనిపించింది.

అందులో భాగంగా జిన్నావర్‌కు జాతీయ పతాకంలోని మూడురంగులు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దానిని పూర్తి చేసింది. 3వ తేదీన అక్కడ జాతీయ జెండా ఎగురవేస్తామని మేయర్ కావేటి మనోహర్ నాయుడు వెల్లడించారు. అయితే ఆ టవర్ పై జాతీయ పతాకాన్ని ఎగురవేసే ధైర్యం మాత్రం చేయలేక పోతున్నారు.

పక్కనే కట్టిస్తున్న ఓ ప్రత్యేకమైన గద్దెపైన ఎగురవేస్తున్నట్లు ప్రకటించారు. టవర్‌పై భారతీయ జెండా ఎగురవేస్తే పాకిస్తాన్ అభిమానులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపడుతున్నట్లున్నారు. ఆ విధంగా చేస్తే పాకిస్థాన్ ప్రభుత్వం గాని, జిన్నా వారసులు గాని ఎవ్వరు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదు. 

అయినా జగన్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?  గుంటూరు తో జిన్నాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఆ టవర్  ను  తొలగించాలని అర్ధశతాబ్ధ కాలం ముందే పురపాలకసంఘం ఓ తీర్మానం చేసింది. అయినా అమలు పరచే సాహసం కాంగ్రెస్ నాయకులు చేయలేక పోయారు. ఇప్పుడు ఆ తాను నుండే ఊడిపడ్డ జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని అనుకోలేము గదా.

\