భారత్ ను ఆధునికత దిశగా నడిపించే దిశలో బడ్జెట్ 

భారత దేశాన్ని ఆధునికత దిశగా నడిపించే అనేక ముఖ్యమైన అంశాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడచిన ఏడేళ్ళలో ప్రభుత్వం రూపొందించిన వివిధ విధానాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందినట్లు చెప్పారు.
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మోదీ బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ  ఆత్మవిశ్వాసంతో మనం మనపైనే ఆధారపడాలనే లక్ష్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడం మనకు తప్పనిసరి అని చెప్పారు. 
భారత దేశం ఓ ఆధునిక దేశంగా స్వయంసమృద్ధి సాధించడం చాలా అవసరమని చెబుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునికత దిశగా నిరంతరం విస్తరిస్తోందని తెలిపారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వ విధానాలన్నిటినీ నిర్మల సీతారామన్ సమగ్రంగా వివరించారని ఆయన కొనియాడారు.
 
 ఆత్మనిర్భర్ అర్థ వ్యవస్థ శీర్షికతో జరిగిన బీజేపీ కార్యకర్తల వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, తన ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన సంతృప్తికరంగా జరగాలనే లక్ష్యంతో పని చేస్తోందని చెప్పారు.    ఏడేళ్ళ క్రితం భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.1,10,000 కోట్లు కాగా నేడు రూ.2,30,000 కోట్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు 200 బిలియన్ డాలర్ల నుంచి 630 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆయన తెలిపారు. వీటన్నిటికీ కారణం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర విధానాలేనని ప్రధాని వివరించారు.  బడ్జెట్ ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిందని ప్రధాన మంత్రి చెప్పారు.
కరోనా  మహమ్మారి తర్వాత సరికొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోందని ప్రధాని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రారంభ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నేడు భారత దేశం పట్ల ప్రపంచం చూసే దృక్పథం చాలా మారిందని చెప్పారు.
బలమైన భారత దేశాన్ని చూడాలని ప్రపంచం కోరుకుంటోందని చెబుతూ భారత దేశం పట్ల ప్రపంచ దృక్పథం మారినందువల్ల మన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళడం మనకు తప్పనిసరి అని ప్రధాని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టిందని పేర్కొంటూ ఆర్గానిక్ సాగుపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనివల్ల వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా మారుతుందని చెప్పారు. రైతులకు సరసమైన ధరలకు కిసాన్ డ్రోన్లను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామని చెప్పారు.
దేశ సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెబుతూ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఎన్‌సీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు.