పంజాబ్ సీఎం అభ్యర్థిపై ఇరకాటంలో కాంగ్రెస్!

పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించాలని ఆ పదవికోసం పోటీ పడుతున్న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్  చన్నీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు పట్టుబడుతూ ఉండడంతో, ఒకటి – రెండు రోజులలో ప్రకటిస్తామని హామీ ఇచ్చిన పార్టీ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.
ఆ పదవికి పోటీ పడుతున్న వారిద్దరికీ పార్టీ ఎమ్యెల్యేల  మద్దతు లేదని అంటూ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ కుమార్ జాక్కర్ పేర్కొనడం ఇబ్బందికరంగా మారింది.  ఫజిల్కా జిల్లాలోని అబోహర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో  జాఖర్ చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టింది.

తన స్వగ్రామంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జాఖర్ మాట్లాడుతూ, “దేవుడు ఏది సరైనదో అది చేస్తాడు. అయినా నాకు పశ్చాత్తాపం లేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడినప్పుడు, 79 మంది ఎమ్మెల్యేలను తదుపరి ముఖ్యమంత్రికి ఓటు వేయాలని అడిగారు. ఆ సమయంలో నాకు 42 మంది నా పేరే చెప్పారు” అంటూ వెల్లడించారు. 
 
మిగిలిన వారిలో, సుఖ్‌జీందర్ సింగ్ రంధావాకు 16 మంది, పెర్నీత్ కౌర్ (అమరీందర్ భార్య)కి 12 మంది మద్దతు ఇవ్వగా  నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 6 మంది, చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారని బహిరంగ పరచారు. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన చన్నీ పేరును ఇద్దరు మాత్రమే చెప్పారని పేర్కొనడంతో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల సమయంలో నవ్వులాటగా మారింది. 

”రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి పంజాబ్ డిప్యూటీ సీఎం కావడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అడిగారు. సీఎం ముఖంగా జనం నా పేరును పాపులర్ ఛాయిస్‌గా తీసుకున్నారని.. నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పాను. లేకుంటే ఆ సమయంలో నేను ఎం.ఎల్.ఏ కూడా కాదు” కూడా తెలిపారు. పైగా, తాను హిందువు కావడంతో ముఖ్యమంత్రిగా చేయలేక పోతున్నామని పార్టీ కేంద్ర నాయకులు తెలిపారని అంటూ పంజాబ్ లో లౌకికవాదం లేదా అని ప్రశ్నించారు.

జాఖర్ బహిరంగ వ్యాఖ్యలతో చన్నీ, సిద్దులలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ అధిష్ఠానంకు ఇబ్బందికరంగా మారింది.  జాఖర్ తన మేనల్లుడు సందీప్ జాఖర్‌కు మద్దతుగా అబోహర్‌లో ప్రచారం చేస్తున్నారు. జఖర్ స్వయంగా అబోహర్ నుండి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 

 
 కానీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన అరుణ్ నారంగ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గురుదాస్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ద్వారా లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ 2019లో అక్కడ బీజేపీకి చెందిన సన్నీడియోల్ చేతిలో ఓటమి చవిచూశారు.