మమతకు ముంబై కోర్ట్ సమన్లు 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబయి కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 1 న ముంబయి సిటీకి  వచ్చినప్పుడు జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలపై దాఖలైన కేసులో మార్చి 2న తమ ముందు హాజరు కావాలని ముంబైలోని మజ్‌గావ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

బీజేకీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద్ గుప్తా జాతీయ గీతాన్ని ఆరోపించారని మమతపై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టును గుప్తా కోరారు. గత సంవత్సరం రచయిత-కవి జావేద్ అక్తర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రధాన వక్తగా పాల్గొన్న మమతా బెనర్జీ “జాతీయ గీతం ప్రారంభమైనప్పుడు కూర్చొని ఉన్నారు.

తర్వాత ఆమె లేచి, రెండు పద్యాలు పాడి ఆకస్మికంగా పాడటం మానేశారని ఆ ఫిర్యాదులో వివేకానంద్ గుప్తా పేర్కొన్నారు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిందని గుప్తా తెలిపారు. జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆలపించినా ఆడియెన్స్ లేచినిలబడి గౌరవం చాటుకోవాలని 2015లో హోం మంత్రి శాఖ ఇచ్చిన ఉత్తర్వులను మమతా బెనర్జీ ఉల్లంఘించారని తన ఫిర్యాదులో గుప్తా పేర్కొన్నారు. 

 దీనిపై కోర్టు స్పందిస్తూ, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటికీ అధికార విధులను నిర్వర్తించనప్పుడు ఆమెపై ప్రొసీడ్ కావడానికి ఎలాంటి అడ్డూ లేదని పేర్కొంది. 

మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని ఆలపించి, అర్థాంతరంగా ఆపేసి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు, ఫిర్యాదుదారు వాంగ్మూలం, వీడియో క్లిప్, యూట్యూబ్‌లోని వీడియో ద్వారా ప్రాథమిక ఆధారులున్నట్టు స్పష్టమైందని కోర్టు పేర్కొంది. నేషనల్ హానర్ యాక్ట్-1971 సెక్షన్ 3 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది.