కేసీఆర్ వాఖ్యలకు నిరసనగా బిజెపి నేతల భీం దీక్ష 

రాజ్యాంగం మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు గురువారం `భీం దీక్ష’ నిరసనలు జరిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో పాల్గొంటూ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే భయం పట్టుకుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి ధ్వజమెత్తారు. 
 
 దళితులపై ఉన్న కోపంతోనే రాజ్యాంగం మార్చాలంటున్నారని పేర్కొంటూ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. . మూడెకరాల భూమి అన్నారు…మర్చిపోయారని చెబుతూ మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే ఇపుడు దాని విలువ రూ 60 లక్షలు అయ్యేదని పేర్కొన్నారు. 
 
కేవలం ఎన్నికల కోసమే దళితబందు తీసుకొచ్చారని చెబుతూ అంబేద్కర్ జయంతి, వర్దంతికి కేసీఆర్ ఒక్కరోజు కూడా నివాళులు అర్పించలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 25 శాతం కన్నా ఎక్కువ ఒక్క మెగా కృష్ణా రెడ్డి కాంట్రాక్టర్ కు  కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని సంస్థలను నాశనము చేశారని, కల్వకుంట్ల పాలన సాగుతోందని చెప్పారు.
 
తెలంగాణ సాధించడంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉపయోగపడిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ జై భీమ్ దీక్షలో ఈటెల పాల్గొంటూ  రాజ్యాంగాన్ని అవమాన పరిచేవిధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ వచ్చాక ధర్మం, న్యాయం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.  కొడుకు, మనవడు, ముని మనవడు రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
 
 కాగా, రాజ్యాంగం విషయంలో చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఢిల్లీలో తెలంగాణ భవన్ లో జరిగిన దీక్షలో పాల్గొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
‘‘తెలంగాణలోని అన్ని కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కి ఎందుకు ఇంత అహంకారం? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా? పంచతీర్దాల పేరుతో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? సచివాలయం వద్దు గడీలు కట్టుకోవాలని అనుకుంటున్నారా..?” అంటూ ప్రశ్నించారు. 
 
కేసీఆర్‌కి బుద్ధి ఉందా? కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించొద్దు అనే విధంగా వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. దళిత సమాజాన్ని అణిచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.  ఈ దీక్షలో బండి సంజయ్ తో పాటు  ఎంపీ డి అరవింద్ కూడా పాల్గొన్నారు.