ఆరోగ్య అత్యవసరం ఎదుర్కోవడంలో అమెరికా విఫలం!

ప్రజారోగ్య సంక్షోభాలు తలెత్తినపుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికన్‌ ఫెడరల్‌ పర్యవేక్షక సంస్థ పేర్కొంది. దేశం తరపున స్పందించడానికి సంబంధించి తన విధులను నిర్వర్తించలేదని తెలిపింది. 

కరోనా మహమ్మారి, తీవ్రమైన వాతావరణ విపత్తులు, బయో టెర్రరిస్ట్‌ దాడులకు గల అవకాశాలతో సహా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు దేశం తరపున ప్రతిస్పందనకు నాయకత్వం వహించాల్సిన తన బాధ్యతలను నెరవేర్చడంలో అమెరికా ఫెడరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ ( హెచ్‌హెచ్‌ఎస్‌) విఫలమైందని ప్రభుత్వ అకౌంటబిలిటీ కార్యాలయాన్ని ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఎపి) ఒక నివేదికలో తెలిపింది. 

ఈ అకౌంటబిలిటీ ఆఫీస్‌, అమెరికన్‌ కాంగ్రెస్‌ కోసం పనిచేసే స్వతంత్ర, పక్షపాత రహిత సంస్థ. హెచ్‌హెచ్‌ఎస్‌ నాయకత్వం అమెరికా ప్రభుత్వానికి హై రిస్క్‌ గా పరిణమిస్తోందని హెచ్చరించింది. పైగా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోందని ఎపి నివేదిక పేర్కొంది. 

ఈ బాధ్యతారాహిత్యానికి ఎలాంటి శిక్షలు విధించాలో ఆ కార్యాలయం తక్షణమే సూచించనప్పటికీ హెచ్‌హెచ్‌ఎస్‌ కార్యకలాపాల పట్ల అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం వుందని స్పష్టమవుతోంది.