100 మంది ప్రభుత్వాధికారులను పొట్టనబెట్టుకున్న తాలిబన్లు 

గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్‌ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి పనిచేసిన వారితో సహా 100 మంది మాజీ ప్రభుత్వాధికారులను పొట్టనబెట్టుకుందని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతుంది. 
 
భద్రతా మండలికి అందించిన నివేదిక గురించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. బాధితుల్లో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువ మంది తాలిబన్‌, దాని అనుబంధ సంస్థల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఈ హత్యలకు తాలిబన్‌ ప్రభుత్వం క్షమాపణలు చెబుతున్నప్పటికీ  హత్యలు, కిడ్నాపు వంటి దుశ్చర్యలకు సంబంధించిన నివేదికలు ఆప్ఘనిస్తాన్‌లోని ఐరాస సహాయ మిషన్‌ (ఉనామా)కు అందుతూనే ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక అరెస్టులు, దాడులు, బలవంతపు చర్యలకు సంబంధించిన కేసులు యుఎన్‌ మిషన్‌ వద్ద నమోదయ్యాయని, ఇందులో 42 మంది తాలిబన్ల వల్ల జరిగాయని నివేదికలు అందినట్లు వెల్లడించారు. 
 
సుమారు 50 మందిని ఐఎస్‌ఐఎల్‌-కెపి (తాలిబన్‌ అనుబంధ సంస్థ) పొట్టన పెట్టుకుందని నివేదికల్లో ఉందని తెలిపారు. 8 మంది పౌర సంఘాల కార్యకర్తల్లో ముగుర్ని తాలిబన్లు, మరో ముగుర్ని ఈ సంస్థ పెట్టన పెట్టుకుందని, మరో 10 మందిని అరెస్టులు, దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడ్డాయని తెలిపారు. 
 
ఇద్దరు జర్నలిస్టుల్లో ఒకరు ఈ సంస్థ చేతిలో హత్యకు గురయ్యారన్నారు. ఆఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నాటి నుండి ఆ దేశం అనిశ్చితితో కొట్టుమిట్టాడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 2022 నాటికి 22.8 మిలియన్ల మంది ప్రజలు సంక్షోభంలో చిక్కుకుంటారని హెచ్చరించారు. ఆహార అభద్రతలో ఉంటారని పేర్కొంటూ ఐదేళ్లలోపు చిన్నారుల్లో సగం మంది పోషహాకారంతో బాధపడుతున్నారని చెప్పారు.