అమెరికా అధ్యక్ష పదవికి తిరిగి పోటీలో ట్రంప్!

అమెరికా అధ్యక్ష పదవికి మరో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో తిరిగి పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటి నుండి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. తిరిగి తాను పోటీ చేయబోతున్నట్లు ఆయన రెండు రోజుల క్రితం స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 
 
అమెరికా లెజిస్లేచర్​ బిల్డింగ్​పై దాడి ఘటనపై ఆయన టెక్సాస్​లో మాట్లాడుతూ ఈ దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి క్షమాభిక్ష పెడతానని ఆయన ప్రకటించడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. 
 
 టెక్సాస్ లోని కాన్రోలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘2024 అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి.. నేను మళ్లీ గెలిస్తే గతంలో దాడిలో పాల్గొన్న వారి పట్ల న్యాయంగా ప్రవర్తిస్తా. క్షమాబిక్ష అవసరమైతే పెడ్తాం. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం వారి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోంది’’ అని స్పష్టం చేశారు. 
 
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​ ఎన్నికను వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్​ మద్దతుదారులు నిరుడు జనవరి 6న వాషింగ్టన్​లోని యూఎస్​ లేజిస్లేచర్​ బిల్డింగ్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా మొదలైన అల్లర్లలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రభుత్వం దాదాపు 700 మందికి పైగా అరెస్ట్​చేసింది. వీరిలో హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 225 మందికి తీవ్రమైన శిక్షలు పడే ఆస్కారం ఉంది. అల్లర్లలో పాల్గొన్న వారిపై జరుగుతున్న విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పదేపదే మాట్లాడుతున్నారు. తాజాగా వారి గురించి మరో కామెంట్​చేయడంతో పాటు అధ్యక్షబరిలో ఉన్నానని పరోక్షంగా సంకేతమిచ్చారు.