దేశం పట్ల బాధ్యతల నిర్వహణలో అమిత బలం ఎన్సీసీ

దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన బలం తనకు  ఎన్సీసీ లో పొందిన శిక్షణ వల్ల లభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన  ఎన్సీసీ  ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్సీసీ గణతంత్ర దినోత్సవాల శిబిరం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 28న ఈ ర్యాలీ జరుగుతుంది. 
మోదీ మాట్లాడుతూ, ‘‘మీలాగే నేను కూడా ఒకప్పుడు చురుకైన ఎన్సీసీ కేడెట్‌నని చెప్పడం గర్వంగా ఉంది. ఎన్సీసీలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో నేడు నేను అద్భుతమైన శక్తిని పొందుతున్నాను’’ అన్నారు.
 స్వాతంత్య్రం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత మహోత్సవాలను దేశం జరుపుకుంటోందన్నారు. అటువంటి సమయంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కరియప్ప మైదానంలో తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని తెలిపారు.
రిపబ్లిక్ డే వేడుకల అనంతరం ఏటా జవనరి 28న ఎన్సీసీ కేడెట్స్ పరేడ్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పైగా అజాదీ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది ఏడు రోజుల పాటు రిపబ్లిక్‌ డే వేడుకలు జరుగుతున్నాయి.  
 
ఈ నెల 23 నుంచి మొదలైన వేడుకల్లో ఇవాళ ఎన్సీసీ కంటింజెంట్‌ ఈవెంట్స్ చివరి రోజు కావడంతో ఈ పరేడ్‌కు ప్రధాని ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆర్మీ యాక్షన్, మైక్రో లైట్ ఫ్లైయింగ్, పారా సైలింగ్ వంటి వాటిలో ఎన్సీసీ కేడెట్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కేడెట్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం ఉత్తమ కేడెట్లకు మెడల్స్‌ను ప్రధాని బహూకరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఎన్సీసీ   (నేషనల్ కేడెట్ కాప్స్) ర్యాలీలో సిక్కు కేడెట్ తలపాగాను ధరించారు. ఎర్రని ఈకలతో అలంకరించిన రైఫిల్-గ్రీన్ తలపాగాను ధరించారు. కేడెట్ల కవాతును సమీక్షించి, గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ కేడెట్లకు పతకాలు, బ్యాటన్లను బహూకరించారు.
స్వాతంత్య్ర దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు గొప్పగా ప్రచారమవుతున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరాఖండ్ సంప్రదాయ తలపాగాను ధరించారు.  ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రంతో కూడిన ఈ తలపాగా ఆకర్షణీయంగా కనిపించింది. అదేవిధంగా మణిపూర్‌లో ప్రసిద్ధమైన అంగ వస్త్రాన్ని కూడా ధరించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.