పారిశ్రామిక కాలుష్యంతో విశాఖ ఉక్కిరి, బిక్కిరి 

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రభుత్వ కార్యకలాపాలను అక్కడకు మార్చాలని ఒక వంక వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండగా, మరోవంక ఆ నగరం పారిశ్రామిక కాలుష్యంతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని నాగరాలకన్నా ఈ నగరమే అత్యధికంగా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్లు వెల్లడి అవుతున్నది.
 ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడల్లో గాలి కాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యతా ప్రమాణాలు ఉండాల్సిన స్థాయికి అనేక రెట్లు ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత డిసెంబరులో విడుదల చేసిన గాలి స్వచ్ఛతా ప్రమాణాల్లో బయటపడిన ప్రమాదకర విషయమిది.
పీల్చేగాలి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి ప్రమాణాల్లో ఉండాలన్నదానిపై 15ఏళ్ల తర్వాత సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో గాలి నాణ్యత ఆ మేరకు ఉందా? లేదా? అన్న అంశంపై స్వచ్ఛందసంస్థ గ్రీన్‌పీస్‌ ఇండియా సర్వే చేసింది. దక్షిణాదిలోని 10 నగరాల్లో సర్వే చేసింది. స
మాచార లభ్యత, జనాభా, మోనిటరింగ్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న నగరాలను ఇందుకోసం ఎంపికచేశారు. దానిలో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి నగరాల్లో కూడా సర్వే చేశారు. కాలుష్యం ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకునేందుకు, గాలి నాణ్యతను కొలిచేందుకు రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.
పీఎం 2.5మ్యాటర్‌, పీఎం 10మ్యాటర్‌. పీఎం అంటే పర్టిక్యులేట్‌ మ్యాటర్‌. పీఎం 2.5అంటే మన వెంట్రుక మందానికి దాదాపు 30రెట్లు తక్కువ. అంత చిన్న చిన్న కాలుష్య కారకాలు మనం గాలి పీల్చేటప్పుడు శరీరంలోకి వెళ్లిపోతాయి.
ఇది విశాఖపట్నం నగరంలో ఏకంగా ఏడెనిమిది రెట్లు పెరిగిపోయిందని గ్రీన్‌పీస్‌ సర్వే తెలిపింది. అమరావతిలో ఆరేడు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఇక పీఎం10 విషయానికి వస్తే…విశాఖపట్నంలో ఆరేడు రెట్లు పెరిగింది. అమరావతిలో మూడురెట్లు పెరిగిపోయింది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కాకుండా నేషనల్‌ ఏంబియేట్‌ గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారం చూస్తే అమరావతిలో గాలి నాణ్యత ప్రమాణాలకు లోబడే ఉంది. అయితే విశాఖపట్నంలో మాత్రం ఈ ప్రమాణాల ప్రకారం చూసినా 1.5-2రెట్ల కాలుష్యం ఉందని గ్రీన్‌పీస్‌ సర్వేలో పేర్కొన్నారు. 
 
విశాఖపట్నంలో కాలుష్యానికి ప్రధాన కారణం..పారిశ్రామిక కాలుష్యమేనని తెలిపింది. దీంతోపాటు శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు లాంటి వాటిని మండించడం, వాహన కాలుష్యం కూడా కారణమని పేర్కొంది. 
 
గాలి నాణ్యత దెబ్బతినడం, పీఎం 2.5 ప్రమాణాలు అదుపులో లేకపోవడం వల్ల కాలుష్యకారక గాలి పీల్చి ఏటా 11 లక్షల మంది చనిపోతున్నారు.  కాలుష్యం శరీరం లోపలి భాగాల్లోకి వెళ్లి రకరకాల వ్యాధులకు కారణమై, చివరకు మరణానికి దారితీస్తోందని గ్రీన్‌పీస్‌ సంస్థ తెలిపింది.