కాణిపాకంలో స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు!

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విస్తృతంగా జరిగిన  దేవాలయాలపై దాడులు కాస్త తగ్గాయనుకుంటే తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. హిందూ దేవాలయాల్లో వరుస దాడుల తర్వాత జనం కాస్త ఊపిరి పీల్చుకుంటుండగానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 
 
కాణిపాక ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో రథాలకు నిప్పు పెట్టడమనేది ఇది కొత్తేమీ కాదు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రత్యేకమైన పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సంవత్సరంకు పైగా గడిచినా ఇప్పటికి దోషులను పట్టుకోలేదు.నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు. స్వామివారి ఉత్సవాలకు రథాన్ని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ఇక బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురయ్యారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది ఆ దుర్గమ్మకే తెలియాలి. 
 
చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.