ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురందేశ్వరి హర్షం 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన జిల్లాలకు ఆయా ప్రాంతాలకు చెందిన మహనీయుల పేర్లను పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. కొత్తగా జిల్లాల పెరుగుదలతో వచ్చిన మార్పులు చేర్పులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
దీంతో పాటు కొన్ని జిల్లాలకు ఆ అక్కడి మహనీయుల పేర్లను, జిల్లా ఏర్పడిన ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించేలా పేర్లు పెట్టారు.  అందులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. 
 
దీనిపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి హర్షం ప్రకటించారు.  ‘‘ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్  జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!!!” అంటూ ఆమె ట్వీట్ చేశారు. 
 
అదే విధంగా, తిరుపతి కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు వెంకటేశ్వర స్వామి పేరు వచ్చేలా శ్రీ బాలాజీ జిల్లా అని, రాయచోటి కేంద్రంగా ఏర్పడే జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు, శ్రీవారి భక్తుడు అయిన తాళ్లపాక అన్నమాచార్య పేరు మీద అన్నమయ్య జిల్లా అని, పుట్టపర్తి కేంద్రంగా వస్తున్న జిల్లాకు సత్య సాయిబాబా పేరుతో శ్రీ సత్యసాయి జిల్లా అని పేర్లు పెట్టింది.
 
 అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన పాడేరు కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరుతో అల్లూరి సీతారామ రాజు జిల్లాగా పేరు పెట్లాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక పార్వతీపురం  కేంద్రంగా ఏర్పటవుతున్న జిల్లాను మన్యం జిల్లా అని పేరు పెట్టారు. 
 
అమలాపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాకు ఆ ప్రాంతానికి  గుర్తింపు ఉన్న కోనసీమ పేరుతో కోనసీమ జిల్లా అని పేరు పెట్టింది. ఇక నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు పల్నాడు పేరును పెట్టారు. 
 
 కాగా, గతంలో నెల్లూరు జిల్లాకు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరును పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వైఎస్‌ఆర్ చనిపోయాక ఆయన పుట్టిన కడప జిల్లాకు ఆయన పేరు మీదుగా వైఎస్‌ఆర్ కడప జిల్లా అని రోశయ్య సీఎంగా ఉన్న సయమంలో నామకరణం చేశారు.
ఇలా  ఉండగా,  జిల్లా ప్రజా పరిషత్‌లపై (జెడ్‌పి) ప్రస్తుతానికి జిల్లాల విభజన పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనబడటం లేదు. రెవెన్యూపరమైన అంశాల ప్రాతిపదికనే జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయడం గమనార్హం. 
 
రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, అక్టోబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్‌పి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లసహా పాలకవర్గాలు ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పంచాయతీరాజ్‌ నిపుణులు చెబుతున్నారు. 
 
గతంలో తెలంగాణాలో జిల్లాల విభజన సందర్భంగా పాత జిల్లా పరిషద్ పాలక వర్గాలే పూర్తికాలం కొనసాగాయి. అదే విధంగా ప్రస్తుత జిల్లా పరిషద్ పాలకవర్గాలు తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాతనే జిల్లా పరిషద్ ల విభజన జరుగవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.