అమెరికాలో కోటిమంది చిన్నారులకు కరోనా 

అమెరికాలో కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కోటి మందికి పైగా చిన్నారులు కరోనా బారినపడ్డారు. అమెరికా పిల్లల వైద్యుల అకాడమీ (ఎఎపి), బాలల ఆస్పత్రి సమాఖ్య సంయుక్త నివేదికలో ఈ విషయం వెల్లడించారు. 
 
ఆ నివేదిక ప్రకారం..జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 1,06,03,034 మంది చిన్నారులకు కరోనా నిర్ధారణైంది. మొత్తం కరోనా కేసుల్లో ఇది 18.4 శాతం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ తలెత్తినప్పటి నుండి పిల్లల్లో గణనీయంగా కేసులు పెరిగాయి. 
 
గత వారంలో 11 లక్షల మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారు. గత శీతాకాలంలో నమోదైన కేసుల కన్నా ఇది ఐదు రెట్లు ఎక్కువ. గత రెండు వారాల్లోనే 20 లక్షల మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారు.  సెప్టెంబరు మొదటి వారానికి పిల్లలకు సంబంధించి 56 లక్షల కేసులు వుండేవి. ఇప్పడవి కోటి దాటి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
 
వారంలో రెండో కోట్ల మందికి పైగా
 
ఇలా ఉండగా, కరోనా న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తికి అగ్రదేశాలూ వణికిపోతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు గతవారం కంటే విపరీతంగా పెరిగాయని తాజాగా డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. 
 
గత వారం (జనవరి 17-23)లో ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్లు (2.1 కోట్లకు) పైగా కొత్త కరోనా కేసులొచ్చాయని, ఈ కేసులు అంతకముందు వారంతో పోలిస్తే ఐదు శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 
 
మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి.. కేవలం ఒక్క వారం వ్యవధిలోనే ఏకంగా రెండు కోట్ల కొత్త కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి అని.. డబ్ల్యుహెచ్‌ఓ తాజా నివేదిక వెల్లడించింది. 
 
అయితే ఈ రెండు కోట్ల కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్‌, భారత్‌, ఇటలీ, బ్రెజిల్‌ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొనడం గమనార్హం. ఇక మరణాల పరంగా చూసినా.. అమెరికా, రష్యా, భారత్‌, ఇటలీ, లండన్‌ దేశాల్లోనే అధికంగా సంభవించాయని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.

కాగా, కరోనా కొత్త కేసులు నమోదవ్వడం మాత్రమే కాదు.. అదే వారంలో దాదాపు 50 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఇక జనవరి 23 వరకు 34 కోట్లకు పైగా కేసులు.. 55 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని పేర్కొంది.

అయితే అంతర్జాతీయంగా అనేక దేశాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సమూహ వ్యాప్తిని నివేదిస్తున్నాయని వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల నవంబర్‌, డిసెంబర్‌ నెల్లో అధికంగా కేసులు నమోదైన దేశాల్లో ఇప్పుడు తగ్గుదల కనిపించిందని తెలిపింది. 
 
ఈ వేరియంట్‌ వల్ల అగ్రరాజ్యమైన అమెరికాతోపాటు, ఐరోపా దేశాలు వణికిపోయాయని.. ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా కనిపించిందనీ, ఆ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని పేర్కొంది.