పంజాబ్ లో కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతం

పంజాబ్‌లో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఈసారి పలుకుబడిగల  మంత్రి రాణా గుర్జిత్ సింగ్ వివాదాలకు కేంద్రం అవుతున్నారు. రాణా గుర్జిత్ తన కుమారుడు రాణా ఇందర్ ప్రతాప్ సింగ్ కోసం ప్రచారం చేస్తున్నాడు, అతను సుల్తాన్‌పూర్ లోధి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
కాంగ్రెస్ అతనికి టిక్కెట్ నిరాకరించి, ఈ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను పోటీకి దింపింది. రాణా గుర్జిత్ పొరుగున ఉన్న కపుర్తలా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఆరోపణలతో నవ్వులపాలవుతున్నారు.

అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్‌లో అసంతృప్తి మరింతగా రాజుకొంటున్నది. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత కొందరు నేతలు టికెట్ నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ బస్సీ పఠానా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించగా, మోగా ఎమ్మెల్యే హర్జోత్ కమల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 

 మాజీ ఎంపీ మొహిందర్ సింగ్ కేపీ కూడా అడంపూర్ స్థానం నుండి టిక్కెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందగా, గర్షంకర్ స్థానం నుండి టికెట్ నిరాకరించబడిన నిమిషా మెహతా కూడా బీజేపీలో  చేరారు. జైళ్ల శాఖ మాజీ మంత్రి సర్వన్ సింగ్ ఫిల్లౌర్, ఆయన కుమారుడు దమన్‌వీర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)లో చేరారు.

రాణా గుర్జిత్ ఘటనలో, నలుగురు పంజాబ్ కాంగ్రెస్ నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర మంత్రి రాణా గుర్జిత్ సింగ్‌ను పార్టీ నుండి బహిష్కరించాలని కోరుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక సెగ్మెంట్లలో పార్టీని “బలహీనం” చేస్తున్నారని వారు ఆరోపించారు.

చీమా, జలంధర్ నార్త్ శాసనసభ్యుడు అవతార్ సింగ్ జూనియర్, ఫగ్వారా ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ ధాలివాల్, మాజీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా లేఖ రాశారు.  దోబా ప్రాంతంలోని సుల్తాన్‌పూర్ లోధి, ఫగ్వారా, భోలాత్, జలంధర్ నార్త్, బంగా వంటి వివిధ నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం ద్వారా రాణా గుర్జిత్ సింగ్ కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

“అతని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల గురించి మేము పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తు అతనిపై చర్య తీసుకోకుండా పంజాబ్ మంత్రివర్గంలో తిరిగి చేర్చుకున్నారు” అని చీమా లేఖలో విచారం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు రాహుల్ గాంధీ, హరీశ్ చౌదరి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూలకు ఆ లేఖ ప్రతులను పంపారు.

2018లో ఇసుక మైనింగ్ వేలంలో పాల్గొన్నారనే ఆరోపణలతో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పాలనలో రాజీనామా చేసిన రాణా గుర్జిత్ సింగ్, గత సంవత్సరం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ మంత్రిగా చేశారు.

రాష్ట్రంలో ఇసుక మైనింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 2018లో పంజాబ్ మంత్రివర్గం నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసిన రాణా గుర్జిత్ సింగ్, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును నాశనం చేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని చీమా ఆరోపించారు.

 

“మేడమ్, తిరిగి మంత్రిగా నియమితులైన తర్వాత, రాణా గుర్జిత్ సింగ్, అహంకారాన్ని ప్రదర్శిస్తూ, సుల్తాన్‌పూర్‌లో రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న నవ్‌తేజ్ సింగ్ చీమాపై తన కుమారుడు రాణా ఇందర్ పర్తాప్ సింగ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించాడు” అని ఆ లేఖలో తెలిపారు.

ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా కత్తిపోటుతో సమానమని చీమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీతో అవగాహనతోనే  ఆయన ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మద్యం వ్యాపారం, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న చక్కెర మిల్లుల కారణంగా ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

పంజాబ్‌లో కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు రాణా గుర్జిత్ సింగ్ బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు.