ఆదాయ పన్నును రద్దు చేయండి … స్వామి సూచన

ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2022-23 వార్షిక బడ్జెట్ లో ఆదాయపన్నును రద్దు చేయమని బిజెపి రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ ఆర్ధిక వేత్త డా. సుబ్రమణియన్ స్వామి సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పన్ను రద్దు తప్పనిసరిగా ఉండాలని చెబుతూ, కనీసం ఆర్థిక రికవరీ కరోనా ముందుస్థాయికి చేరుకునే వరకైనా ఆదాయపు పన్ను రద్దును కొనసాగించాలని ఆయన చెప్పారు. 
 
“బిజినెస్ టుడే” పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఆర్థికమంత్రిగా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేసేవారు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా  ‘వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి, కరోనా నుండి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక, ఆ తర్వాత దానిని పర్మినెంట్ చేసే అంశంపై ఆలోచిస్తాను’ అని స్వామి సమాధానం ఇచ్చారు.


బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక ప్రారంభంలోనే ఈ సలహా ఇచ్చానని ఆయన తెలిపారు.  ఆదాయపు పన్ను ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అదే బడ్జెట్ చూసుకుంటే రూ.8 లక్షల కోట్ల నుండి రూ.9 లక్షల కోట్ల మధ్య అవుతుందని, ట్యాక్సేషన్‌కు బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరులను పెంచుకోవచ్చునని తాను సూచించానని ఆయన వెల్లడించారు. 

 
 ఉదాహరణకు 2జీ లైసెన్స్ వేలం మొదటి వేలం ద్వారానే రూ.4 లక్షల కోట్లు వచ్చిందని, ఇది ఆదాయ పన్నుకు సమానమనిపేర్కొన్నారు. పన్నులు పెంచడానికి బదులు ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడితే ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారని స్వామి తెలిపారు. 
 
రీ-ఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని నిబంధనలు ఉంటే పొదుపు రేటు పెరుగుతుందని, తద్వారా వృద్ధి పెరుగుతుందని డా. స్వామి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోన్స్ఉనాలపై పైన వడ్డీ రేటును తగ్గిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఫిక్సెడ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 6 శాతం నుండి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు పొదుపు చేయడానికి ముందుకు వచ్చేలా చేయాలని ఆయన చెప్పారు.