పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అందుకోలేమా!

భారత ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అందుకోలేని అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇప్పటివరకు రూ.9,329 కోట్లు మాత్రమే కేంద్రం సమీకరించింది. గతేడాది బడ్జెట్ ప్రకటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రకారం, 2021-22లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు. 

అయితే ఇది ఇంకా నెరవేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 70 రోజులే మిగిలి ఉన్నాయి. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్‌కు విక్రయించడమే ఈ ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగ్గ విషయం. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించారు. 

ఈ సంస్థకు రూ.61 వేల 562 కోట్ల అప్పు ఉంది. ఒప్పందం మేరకు దీనిలో 25 శాతం అంటే రూ.15,300 కోట్లు మాత్రమే టాటా తీసుకుంటోంది. మిగిలిన మొత్తాన్ని ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్‌కు ఇస్తారు.

పెట్టుబడుల ఉపసంహరణలో అతిపెద్ద ఆశాకిరణ అంటే ఎల్‌ఐసి ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)నే అని చెప్పాలి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.80 వేల కోట్లు సమకూరే అవకాశముంది. గతేడాది బడ్జెట్‌లో రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎం) డేటా ప్రకారం, దీనిలో ఇప్పటి వరకు 5 శాతం మాత్రమే సమీకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎన్‌ఎండిసిలో వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,651 కోట్లను సమీకరించింది. 

ఒఎఫ్‌ఎస్ ద్వారా హడ్కోలో 720 కోట్లు కాగా, హెచ్‌సిఎల్ ఒఎఫ్‌ఎస్ ద్వారా రూ.741 కోట్లను సమీకరించారు. దీని తర్వాత ఇతర కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,994 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఐడిబిఐ బ్యాంక్, బిఈఎంఎల్, పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ వంటి పెద్ద కంపెనీలు వాటాలను విక్రయించడం ద్వారా మరింత డబ్బును సమీకరించే యోచనలో ఉన్నాయి. వీటిలో భారీ మొత్తంలో భారత్ పెట్రోలియం నుంచి నిధులు రానున్నాయి.