వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ ల్లో రహస్య సమాచారం వద్దు 

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల సర్వర్లు విదేశాల్లోని ప్రైవేటు కంపెనీల నియంత్రణలో ఉన్నాయని, రహస్యంగా ఉంచవలసిన సమాచారం కోసం వీటిని వాడవద్దని ప్రభుత్వ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుత విధానంలో లోపాలను గుర్తించిన మీదట నిఘా సంస్థలు రూపొందించిన నూతన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.

రహస్య సమాచారం అక్రమంగా బయటికి పొక్కడాన్ని నిరోధించేందుకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ఉల్లంఘన తరచూ జరుగుతుండటంతో ఈ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది.  విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల సర్వర్లు విదేశాల్లోని ప్రైవేటు కంపెనీల నియంత్రణలో ఉన్నాయని, అందువల్ల రహస్య సమాచారాన్ని వీటి ద్వారా షేర్ చేయవద్దని ప్రభుత్వాధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

రహస్య సమాచారాన్ని వీటి ద్వారా షేర్ చేస్తే, భారత దేశ వ్యతిరేక శక్తులు దానిని దుర్వినియోగపరచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటి వద్ద నుంచి పని చేసే ఉద్యోగులు, అధికారులు కేవలం ఈ-ఆఫీస్ అప్లికేషన్స్‌ను మాత్రమే ఉపయోగించాలని, తమ కంప్యూటర్ సిస్టమ్స్, ఇతర వ్యవస్థలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కు చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా ఆఫీస్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని తెలిపింది.

ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలను నిరోధించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. రహస్య, ఆంక్షలుగల ఉత్తర, ప్రత్యుత్తరాల కోసం కమ్యూనికేషన్ సెక్యూరిటీ పాలసీలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపింది. మొబైల్ ఫోన్లలో ఇటువంటి సమాచారాన్ని ఉంచవద్దని అధికారులను ఆదేశించింది. 

సమావేశాలు జరిగేటపుడు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్లను వాడవద్దని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అమెజాన్ అలెక్సా, యాపిల్ హోంపాడ్ మొదలైనవాటిని కూడా వాడవద్దని తెలిపింది. వర్చువల్ సమావేశాల కోసం గూగుల్ మీట్, జూమ్ వంటి అప్లికేషన్లను వాడవద్దని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డీఏసీ), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్ సమావేశాలను నిర్వహించాలని తెలిపింది.