మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్

మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడ కరోన బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం శనివారం  ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. 
 
ఎనభై ఎనిమిదేళ్ల దేవెగౌడ భారతదేశ 12వ ప్రధానిగా 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకూ సేవలందించారు. 1994 నుంచి 1996 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేడీ(ఎస్) జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
 
రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పరంపర మరిన్ని రోజులు దూసుకుపోనుందని నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారానికి ఏకంగా రోజూ లక్షమందికి కొవిడ్‌ పాజిటివ్‌ ప్రబలే అవకాశం ఉందని కర్ణాటక  వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ప్రకటించారు. కరోనా టాస్క్‌ఫోర్స్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో త్వరలోనే రోజూ లక్షమందికి పాజిటివ్‌ ప్రబలనుందని చెప్పారు.
 
 అందుకు అనుగుణంగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.  రెండు విడతలతో పోల్చితే థర్డ్‌వేవ్‌ పెను ప్రభావం చూపలేదని మంత్రి చెప్పారు. కేసులు పెరిగాయని, అయితే వ్యాక్సినేషన్‌ వల్ల ప్రాణనష్టం తప్పిందని తెలిపారు. అయినా నిర్లక్ష్యం చేయరాదని, కరోనా సోకితే పలు పరిణామాలు ఉంటాయని, ముందుజాగ్రత్తలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు.
 బెంగళూరులో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,049మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 29,068మంది ఉన్నారు. తుమకూరులో 2021,  హా సన్‌లో 1889, మండ్యలో 1506, కల్బుర్గి 1164, బెంగళూరు గ్రామీణ 1036, ఉడుపి 1018, మైసూరు 915, దక్షిణకన్నడలో 897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ వందల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
 కాగా, దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 3 లక్షల 37 వేల 704 కేసులు నమోదయ్యాయి. మరో 488 మంది మరణించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసులు 9,550 తక్కువగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 
 
ప్రస్తుతం దేశంలో 17.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని పేర్కొన్నారు అధికారులు. మొత్తం 21 లక్షల 13 వేల 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 10 వేల 050 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 3.69 శాతం పెరిగాయి.
కేరళ రాష్ట్రంలో కేవలం వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవడం సంచలనం రేపింది. కేరళ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 41,668కి పెరిగింది. కరోనాతో 106 మంది మరణించారు. గత వారంతో పోలిస్తే 206 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగుల శాతం 80 శాతం పెరిగింది. కొత్తగా 54 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి