ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేంద్రంలో మరోసారి బీజేపీ

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్‌– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. 

నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. ప్రధాని మోదీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరలేదని కూడా స్పష్టం చేసింది. 

అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా  రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క ముఖ్యమంత్రికి  పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. 

దేశంలో 53 శాతం మంది తదుపరి ప్రధానిగా నరేంద్ర మోదీనే ఎంపిక చేసుకొంటున్నారు.  రాహుల్ గాంధీని 7 శాతం మంత్రమే ఎంచుకున్నారు. ఇక ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి మమతా బనెర్జీ పట్ల 18 శాతం మొగ్గు చూపుతుండగా, అరవింద్ కేజ్రీవాల్ పట్ల 17 శాతం మంది, రాహుల్ గాంధీ పట్ల 11 శాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. 

కేవలం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే 49 శాతం ప్రజాదరణతో అగ్రగామిగా ఉన్నారు. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం.

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు.

`మూడ్ అఫ్ ది నేషన్’ పెడుతూ ఇండియా టుడే గ్రూప్ ప్రతి ఏడాది రెండు సార్లు ఇటువంటి సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో, ఒక పంజాబ్ లో మినహా   స్థానిక ముఖ్యమంత్రులకన్నా ప్రధానికి ఎక్కువ ప్రజాదరణ కనిపిస్తున్నది. 

దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు.  

తొలి దశలో 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) మందితో, మాలి దశలో గత మూడు వారాల్లో  39,575 మందితో ఈ సర్వే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారు.

ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే అగ్రగామిగా  ఉన్నారు. అంటే యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో, ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రాజ్‌ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారని సర్వే తెలిపింది. దేశంలో 59 శాతం మంది ప్రజలు ఎన్డీయే పాలనా పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. గత ఆగష్టు లో అటువంటి వారి సంఖ్య 53 శాతమే కావడం గమనార్హం. 22 శాతం మంది ప్రజలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం ఎన్డీయే ప్రభుత్వ అత్యుత్తమ విజయం అని భావిస్తున్నారు.