మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతాం

రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కర్నూల్ లో స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారి పింఛన్లను తీసేవేయడానికి వలంటీర్లను సీఎం జగన్కాపలా పెట్టాడని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ వేల కోట్ల రూపాయల నిధులను ఏపీకి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.  మూడేళ్లలో జగన్ ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డు కూడా వేయలేదని ఆయన విమర్శించారు.
అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తానని చెప్పాడని, కానీ ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు లేవని, ఉద్యోగాలను పర్మినెంటు చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవని వీర్రాజు తేల్చి చెప్పారు. మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
పాలనలో జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అని ఆయన ఆరోపించారు. జగన్ ఆలోచన విధానాల వల్లే జిల్లాలోని ఆత్మకూరు అల్లర్ల ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.
 
కాగా, వై ఎస్ జగన్ ది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని వీర్రాజు విజయవాడలో విమర్శించారు. ఉద్యోగులను పీఆర్సీ పేరిట వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.  మధ్యంతర భృతి కంటే ఫిట్‌మెంట్ తగ్గించి ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. 
హెచ్‌ఆర్‌ఎ తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులను ఇంతటి అన్యాయం చేసిన ఇంతటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎన్నడూ చూడలేదని ఆయన ఆరోపించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదని, శత్రు ప్రభుత్వమని నిరూపించుకుందని ఆయన ఎద్దేవా చేశారు.
బకాయిల గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట ఎత్తడం లేదని పేర్కొన్నారు. జీతభత్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉందని చెప్పారు.  అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం తగదని ఆయన హితవు పలికారు.