కలెక్టరేట్ల ముట్టడికి రోడ్డెక్కిన ఉద్యోగులు

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య  ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.   ప్రభుత్వ విడుదల చేసిన జీవోలతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసనలకు దిగారు. గుంటూరు, విజయవాడ నెల్లూరు, కడప, చిత్తూరు, విశాఖ, కర్నూలుతో పాటూ అన్ని చోట్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. 
 
కలెక్టరేట్ల ముట్టడికి అనుమతించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు పలు జిల్లాలో ముందస్తుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 
 
తెల్లవారుజాము నుంచి  ముందస్తు అరెస్టులు చేస్తుండడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు  ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నోటీసులు పట్టించుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అన్ని కలెక్టరేట్ల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కలెక్టరేట్లకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు.
కాగా, జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా ఉపాధ్యా ఉద్యోగ సంఘాలు చేరుకున్నాయి. కలెక్టరేట్‌కు చేరుకునే అన్ని మార్గాల నుంచి ఉద్యోగ సంఘాలు దూసుకొచ్చాయి. పోలీస్ వలయాన్ని చేధించుకుంటూ కలెక్టరేట్ గేటు వద్దకు ఉద్యోగులు చేరుకున్నారు. పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తమను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు తీవ్ర స్థాయిలో పోరాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో జగ్గయ్య  పేటలో చలో కలెక్టరేట్ కు బయలుదేరిన ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  స్టేషన్  ఎదుట కూడా  ఉపాధ్యాయులు సంఘాల నేతలు తమ నిరసనలు  తెలుపుతున్నారు.
రేపే సమ్మె నోటీసు 
మరోవంక, శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వడానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. అన్ని సంఘాలు, ఇరు జేఏసీల ఐక్య కార్యాచరణ వేదిక చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నాడూ సమ్మె చేయలేదు. ఇప్పుడు సమ్మె వరకు వెళితే తొలి పీఆర్సీ సాధన సమ్మె అవుతుంది.
కాగా పీఆర్సీపై గురువారం అమరావతి జేఏసీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో వేరువేరుగా సమావేశాలు నిర్వహించనున్నాయి. పీఆర్సీపై ఏ విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్న దానిపై  సమావేశంలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు, బండి శ్రీనివాసరావు భేటీ కానున్నారు.
శుక్రవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడంతో పాటు, దశలవారీ ఆందోళనలు కూడా జరపాలని నిర్ణయించాయి. అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.