విహారయాత్ర మాదిరిగా హెలికాఫ్టర్ లో మంత్రుల పర్యటన 

వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు  పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ మంత్రుల బృందం రైతులకు ఏమి మేలు చేస్తున్నారో చెప్పలేదని బిజెపి నేతలు మండిపడుతున్నారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు మంత్రుల బృందం వస్తున్నదని రైతులు ఆశగా ఎదురు చూశారని, తెలంగాణ మంత్రులు పర్యటించి వెళ్లిన తీరు చూస్తుంటే విహారయాత్రకు వచ్చి వెళ్లినట్లుగా ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 
 
జనవరి 11న వడగండ్ల వానతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివధంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, పసుపు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయి ఆర్థికంగా మానసికంగా రైతులను కృంగతీసిన సందర్భంలో వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 
 
ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి లు వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని,  మంగళవారం వారు స్వయంగా వచ్చి పంట పొలాలను పరిశీలించి రైతులకు ఆదుకోనున్నారని ప్రచారం చేయడంతో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా మంత్రుల బృందం పర్యటన తర్వాత రైతులకు నిరాశే మిగిలిందని విమర్శించారు.
 
కేవలం 200 నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి రోడ్డు మార్గంలో రావాల్సిన మంత్రుల బృందం హెలికాప్టర్ లో వచ్చి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నాలుగైదు ప్రాంతాలలో పర్యటించి కేవలం ఒకరిద్దరు ఎంపిక చేసిన రైతులను కలుసుకొని హంగామా చేసి వెళ్లారని ధ్వజమెత్తారు. మంత్రులు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 
 
పంచ పాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు అన్న చందంగా వారి పర్యటన పిక్నిక్ స్పాట్ కు వచ్చి వెళ్ళినట్లుగా సాగిందని ప్రకాశ్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు.  నర్సంపేటలో మంత్రులు నిర్వహించిన విలేఖర్ల సమావేశంలోనైనా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించామని కాని జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ముఖ్యమంత్రి గారు పరిశీలించి స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పి వెళ్లారని మండిపడ్డారు. 
 
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా వారం రోజులు గడిచినా పంట నష్టం వివరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటివరకు సమాచారం లేదా? అని ప్రశ్నించారు.  ఇప్పటివరకు అధికారులు కూడా పంట పొలాలను పరిశీలించి 53 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అంచనా వేశారని చెప్పారు.
 పంట నష్టం జరిగిన వెంటనే బాధ్యత గల నాయకులుగా పంటపొలాలను తాము సైతం రెండు రోజులు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. 53 వేల ఎకరాల కంటే ఎక్కువగానే పంట నష్టపోయి ఉంటుందని, వందకు వంద శాతం నష్టం జరిగినప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేశారు.