యుపిలో బిజెపి, అప్నా దళ్, నిషాద్ పార్టీ ఉమ్మడిగా పోటీ 

ఉత్తరప్రదేశ్‌లోని అన్ని 403 స్థానాల్లో తమ పార్టీ మిత్రపక్షాలు అప్నా దళ్, నిషాద్ పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని బీజేపీ అధ్యక్షుడు  జేపీ నడ్డా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ సీఈసీ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నడ్డా తదితర నేతలు హాజరైన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
 
ఇప్పటికే ఈ రెండు పార్టీలతో బిజెపికి పొత్తు నెలకొంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో కూడా కలసి పనిచేయాలని నిర్ణయించారు. “అప్నాదళ్(ఎస్), నిషాద్ పార్టీలతో కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నాం. ఈ ఎన్నికలపై చాలా వివరంగా చర్చించాము. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుంది. మరోసారి ఎన్డీయే 300లకు పైగా స్థానాల్ని గెలుస్తుంది’’ అని జేపీ నడ్డా తెలిపారు. 
 
అయితే మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై నడ్డా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.  తమకు 30 స్థానాలు కావాలని అప్నాదళ్‌ కోరుతున్నది.  2017 నాటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసిన అప్నాదళ్  9 స్థానాలు గెలుచుకుంది. ఇక నిషాద్ పార్టీ ప్రతిపాదన గురించి వెల్లడించలేదు.
 
అసెంబ్లీ ఎన్నికల్లో్ పోటీకి సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అఖిలేష్ పోటీ చేయాలని అనుకుంటే చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కోరితే అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని అఖిలేష్ ప్రకటించారు.
 
కానీ ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదని,  ఆ పార్టీ చాల వెనుకబడి ఉందని స్పష్టం చేశారు. “నిజానికి ఐదేళ్ల మా పాలనలో మాఫియా, గూండాలను రాష్ట్రం బయటికి తరిమికొట్టాం. అయితే జైల్లో వేశాం. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గూండాలను, మాఫియాను మళ్లీ దింపుతోంది. ఆ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో అందరూ వారే ఉన్నారు’’ అని ధ్వజమెత్తారు.
 
ఇక భారతీయ జనతా పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ చేరికపై యోగి మాట్లాడుతూ ‘‘అపర్ణా యాదవ్ చేరిక పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. మోదీ డబుల్ ఇంజన్ పనిని గుర్తించి ఆమె పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని చెప్పారు.
 
 రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పుకుంటున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌కు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం మాత్రం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అంతకు ముందు ఎద్దేవా చేశారు. , సొంత కుటుంబంలో సక్సెస్ కాలేకపోయిన అఖిలేష్ యాదవ్ సీఎంగా,  పార్లమెంటు సభ్యుడిగా కూడా సక్సెస్ కాలేదని విమర్శించారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన భయపడుతున్నారని చెబుతూ  గెలుపు నల్లేరుమీద నడకలా సాగేందుకు సురక్షితమైన స్థానం కోసం చాలా కాలంగా ఆయన వెకుకుతున్నారని ఆరోపించారు.  ‘అఖిలేష్ జీ…2012 నుంచి 2017 వరకూ మీరు బాగా అభివృద్ధి చేసిన పనులేంటో చెప్పండి?. బీజేపీ చేసిన అభివృద్ధి పనులతో మీరు పోటీ పడలేరు” అని మౌర్య ప్రశ్నించారు.

అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం స్పందిస్తూ  యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూతుళ్లకు ఎలా రక్షణ కల్పించిందో ఈ చర్య తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.  అపర్ణా యాదవ్ మరియు సంఘమిత్ర మౌర్యలు బిజెపిలో సురక్షితంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.