ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష

ఏపీ ఉద్యోగులకు సంఘీభావంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది.

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆవేదనను బేఖాతరు చేస్తూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను విడుదల చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా రఘురామ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాస దీక్ష చేపట్టారు.

అధికారుల కమిటీ అనేక సిఫార్సులు చేసినప్పటికీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ వ్యతిరేకించారు.

మిశ్రా కమిషన్ నివేదికను బహిర్గతం  చేయకుండా సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదిక ఆధారంగా చేసినటువంటి పీఆర్సీ సంబంధిత అంశాల ప్రకటనను రఘురామ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా 30 శాతం ఫిట్‌మెంట్‌తో 1-7-2019 ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. 

ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.  ఉద్యోగులకు ఎన్నో చేస్తామని ఎన్నికల్లో కూడా వాగ్దానాలు ఇచ్చామని రఘురామ గుర్తు చేశారు.

ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పక తప్పదని పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులకు ఇలానే జరగాలని తప్పుగా మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. \ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఏం వస్తుందని… వారు లంచాలు ఎలా తీసుకుంటారని రఘురామ ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ చెప్పారని గుర్తు చేశారు.

కాగా, ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సచివాలయం కోఆర్డినషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు. 

అందులో భాగంగా ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని తీర్మానం చేశామని చెప్పారు. కావున సభ్యులందరూ ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని కాకర్ల వెంకటరామి రెడ్డి కోరారు.

భగ్గుమంటున్న ఉద్యోగులు 

రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించడంపై ఉద్యోగులు రగులుతున్నారు. హెచ్ఆర్ఏకు కోత, సీసీఏ ఎత్తివేత, క్వాంటం పెన్షన్‌లో మార్పులు చేస్తూ జారీ అయిన చీకటి జీవోలను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాగే ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు, పలు ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబ్‌లో కొనసాగించాలని, ఉద్యోగుల ప్రయోజనాలను హరించేలా ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ.. గురువారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. అలాగే ఈనెల 28న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.