నిబంధనలకు అనుగుణంగానే శకటాల ఎంపిక 

గణతంత్ర దినోత్సవాల కవాతు కోసం నిబంధనలకు అనుగుణంగానే శకటాల ఎంపిక చేసిన్నట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రాలకు చెందిన శకటాలను తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రులు  మమతా  బెనర్జీ,ఎంకే స్టాలిన్ లు వ్రాసిన లేఖలకు ఆయన జవాబులు వ్రాసారు. 
తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర  సమర యోధుల గురించి చాటిచెప్పే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రతిపాదించింది. దీనిని తిరస్కరించడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని, తమ శకటాన్ని అనుమతించాలని కోరారు. తమ శకటాన్ని తిరస్కరించడం అవమానకరమని ఆరోపించారు.
నేతాజీ సుభాశ్ చంద్రబోస్ గురించి వివరించే విధంగా శకటాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని కూడా కేంద్రం తిరస్కరించడంతో మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నట్లు తెలిపారు. తాము ప్రతిపాదించిన శకటంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వంటివారి గురించి కూడా వివరిస్తున్నామని, దీనిని తిరస్కరించడం స్వాతంత్య్ర సమర యోధులను చిన్నచూపు చూడటమేనని ఆమె  ఆరోపించారు.
ఈ నేపథ్యంలో స్టాలిన్, మమతలకు రాజ్‌నాథ్ సింగ్ లేఖలు రాశారు. మమతకు రాసిన లేఖలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌కు సమున్నత గౌరవం ఇస్తోందని చెప్పారు. నేతాజీ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహిస్తోందని ఆయన గుర్తు చేశారు.
 ఈ సంవత్సరం నుంచి గణతంత్ర దినోత్సవాలు నేతాజీ జయంతి రోజు నుంచి ప్రారంభమవుతాయని, జనవరి 30తో ముగుస్తాయని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవాలకు శకటాలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. కళలు, సంస్కృతి, సంగీతం, నృత్యం రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన కమిటీ ఈ శకటాలను ఎంపిక చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రాలు పంపించే శకటాల ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెబుతూ ఏ శకటాన్ని ఎంపిక చేయాలో ఈ కమిటీయే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 29 ఎంట్రీలలో 12 డిజైన్లను ఈ కమిటీ ఎంపిక చేసిందని రక్షణ మంత్రి చెప్పారు.
నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన శకటం నివాళులర్పిస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజల ఆందోళనను తన లేఖ పరిష్కరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవాల్లో అందరూ పాల్గొనాలని కోరారు. 2016, 2017, 2019, 2021 సంవత్సరాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ శకటాలకు అనుమతి లభించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.