ఈ ఏడాది ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్‌ డే పరేడ్‌

వరుసగా రెండో ఏడాది  గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. వైరస్ ఉధృతంగా వ్యాపిస్తుండటంతో ఈ ఏడాది కూడా వేడుకలను ఎలాంటి ఆడంబరాలు లేకుండానే జరుపుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి వేడుకల్లో భారీ మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిపబ్లిక్‌ డే పరేడ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణంగా ఏటా ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే పొగమంచు కారణంగా ఈ సారి ఉదయం 10.30 గంటలకు పరేడ్‌ను మొదలుపెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది. జనవరి 26న ఢిల్లీలో మంచు దుప్పటి పరుచుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో  ప్రేక్షకులు పరేడ్‌ను చూసేందుకు  వీలుగా అరగంట ఆలస్యంగా పరేడ్‌ను ప్రారంభించాలని నిర్ణయించామని ప్రకటించింది.

అంతేగాక, రాజ్‌పథ్ మార్గంలో రెండు వైపులా ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్ల చొప్పున 10 ఎల్‌ఈడీ స్క్రీన్లను  ఏర్పాటు చేయనున్నట్లు  రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. పరేడ్‌ ప్రారంభానికి ముందు ముందు గత గణతంత్ర దినోత్సవాలకు సంబంధించిన వీడియోలు, సాయుధ బలగాలపై తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌, ఇతర స్ఫూర్తిదాయక వీడియోలను ఈ ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.

ఆ తర్వాత పరేడ్‌ మొదలవగానే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దేశానికి స్వాతంత్య్రం వచ్చి75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నారు. 

అందులో భాగంగా గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించనుంది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్,ఎంఐ17,సారంగ్, అపాచీ, డకోటా వంటి విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. గగనతలంలో 15 ఆకృతులను ప్రదర్శించనున్నట్లు వాయుసేన అధికారులు తెలిపారు.

మరోవంక, రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరించడంతో  ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లను చేస్తున్నారు. రిపబ్లిక్ వేడుకల దృష్టా ఈ నెల 20 నుంచి దేశ రాజధాని గగనతలంపై డ్రోన్లు (యుఎవిలు), పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు లాంటి సబ్ కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్‌ఫామ్‌ల ఆపరేషన్‌ను నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

కాగా గణతంత్ర దినోత్సవాల దృష్టా భద్రతను పూర్తి కట్టదిట్టం చేశామని, గణతంత్ర వేడుకలు జరిగే మొత్ంత ప్రాంతాన్ని ముఖాలను గుర్తు పట్టే సాఫ్ట్‌వేర్‌తో కూడిన 300కు పైగా సిసిటివిలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దీపక్ యాదవ్ చెప్పారు. పారా మిలిటరీ బలగాలతో పాటుగా ఢిల్లీ పోలీసుకు చెందిన అన్ని విభాగాలు, ఎన్‌ఎస్‌జికి చెందిన బృందాలను భద్రత కోసం వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.

రెండు డోసులు పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించడం జరుగుతుందని, పిల్లలను అనుమతించబోమని చెపారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు 24 వేల మంది ఆహూతులనుఅనుమతించడం జరుగుతుందని, ఇందులో 4 5 వేల టికెట్లను ప్రజలకు జారీ చేయడం జరుగుతుందని దీపక్ యాదవ్ చెప్పారు.

పంజాబ్‌లో ఇటీవల ప్రధాని కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం దృష్టా అలాంటి సంఘటనలు మరో సారి జరక్కుండా పోలీసు బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తాయని ఢిల్లీ పోలీసు అధికారులు చెప్పారు.