పంజాబ్ ఎన్నికల వాయిదా కోరుతున్న రాజకీయ పక్షాలు

పంజాబ్ ఎన్నికల వాయిదాకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఈమేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. గురురవిదాస్ జయంతి ఉత్సవాలు ఫిబ్ర‌వ‌రి 16న బెనారస్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది.

 దీంతో వీరంతా పంజాబ్ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనే అవకాశం లేకుండా పోతుంది. పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసీకి ప్రధాన పార్టీలు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

పంజాబ్ ఎన్నికలను ఒక వారం పాటు వాయిదా వేయాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురురవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పంజాబ్ రాష్ట్రం నుంచే దాదాపు 20 లక్షలమందికి పైగా వెళ్లే అవకాశం ఉందని చన్నీ తెలిపారు. 

కానీ షెడ్యూల్ ప్రకారం పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే దశలో జరగనున్నాయి. దీంతో ఆ 20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోనియోగించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీని పంజాబ్ సీఎం లేఖలో కోరారు.

గురురవిదాస్ జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గాలు సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని కోరాయి. పంజాబ్‌లో ఆ వర్గానికి చెందిన వారు దాదాపు 32 శాతం మంది ఉన్నారు. దానితో  విజయావకాశాలు కూడా తారుమారు అవుతాయి. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరుతున్నాయి.

బీజేపీ, బీఎస్పీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశాయి. గురురవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జర‌గ‌నుంది. అనంతరం ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. 

బిజెపి నేత, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ కూడా పంజాబ్ ఎన్నికలను ఫిబ్రవరి 18 తర్వాత నిర్వహించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిన్నింటికి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. 

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్యెల్యే 

కాగా, పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ హర్‌జోత్ కమల్ ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛండీగఢ్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన హర్‌జోత్ కమల్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మీనాక్షి లేఖి సహా పలువురు బీజేపీ కీలక నేతల సమక్షంలో బీజేపీలో  చేరారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌కు ఆ పార్టీ మోగ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఖరారు చేసింది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హర్‌జోత్ కమల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.