లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోంది

 లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని   మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే వెల్లడించారు.  ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు.
 
‘లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్‌ యాజామాన్యాన్ని కోరాను.’ అని మంత్రి రాజేశ్‌ టోపే తెలిపారు. 
 
మమ్ముట్టికి కరోనా 

కాగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా  టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మమ్ముట్టి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం జ్వరం మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 

‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్న కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. స్వల్ప జ్వరం మినహా ఇతర సమస్యలేవీ లేవు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండండి. ఎల్లవేళలా మాస్క్ ధరించండి’ అంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  

70ఏళ్ల మమ్ముట్టి ప్రస్తుతం ‘సీబీఐ 5’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఆ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ‘సీబీఐ 5’లో మమ్ముట్టి సేతురామన్ అయ్యర్ అనే కీలకపాత్రలో కనిపించనున్నారు.