బిజెపిలోకి ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్!

ముగ్గురు మంత్రులతో సహా దాదాపు పది మంది ఎమ్యెల్యేలు బిజెపిని వీడి తమ పార్టీలో చేరడంతో సంబరపడుతున్న సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సొంత మరదలు బీజేపీలో చేరనున్నట్లు వార్తలు రావడంతో ప్రధాన ప్రతిపక్షంలో కలకలం రేగుతున్నది. 

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. కొన్ని రోజులుగా బిజెపి నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమెకు ఎన్నికలలో పోటీ చేయడానికి సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పిన్నట్లు తెలుస్తున్నది. 

అపర్ణ యాదవ్‌, ములాయం సింగ్‌ చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ సతీమణి. 2017 అసెంబ్లిd ఎన్నికల్లో ఎస్‌పీ టికెట్‌పై అలహాబాద్‌ నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ జోషి చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

అపర్ణ యాదవ్‌ ఎస్‌పీలో కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో పార్టీ లైన్‌కు విరుద్ధంగా బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో బీజేపీకి ఆమె మద్దతు ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా రూ.11 లక్షల విరాళం అందజేశారు.

మొదటి జాబితాలో 21 మందికి సీట్లు నిరాకరణ!

కాగా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మొదటి రెండు దశలలో 113 స్థానాలకు జరిగే ఎన్నికలలో బిజెపి మొదటి జాబితాలో 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు వదిలింది. అయితే వీరిలో 63 మంది ప్రస్తుత ఎమ్యెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వగా, 21 మందికి ఇవ్వలేదు. కొత్తవారిని ఎంపిక చేశారు.

ముఖ్యమంత్రి యోగి ఆదియినాథ్ ను అయోధ్య లేదా మధురాలా నుండి పోటీ  చేయించాలని మొదట అనుకున్నప్పటికీ కొత్త నియోజకవర్గాలలో ప్రచారంకు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుందని ఆయన స్వస్థలమైన గోరఖపూర్ సిటీ నుండే పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

వరుసగా ఐదు సార్లు గోరఖ్‌పూర్ నుండి ఎంపీగా గెలుపొందిన ప్రదేశం కావడంతో ఆయన అక్కడ ఎక్కువగా ప్రచారం చేయనవసరం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారింపవచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ  చేయడం కోసం కొద్దికాలం క్రితం ఉత్తరాఖండ్ గవర్నర్ గా రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్య ఆగ్రా నుంచి పోటీ చేయిస్తున్నారు. 

టికెట్లు సీట్లు ఇచ్చిన వారిలో 44 మంది ఓబీసీలు, 19 మంది ఎస్సీలు, 10 మంది మహిళలకు ఉన్నారు. శాతం ప్రకారం చూస్తే, 68 శాతం  అభ్యర్థులు ఓబిసి, ఎస్సి, మహిళలు ఉన్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతుల ఆందోళన ఉధృతంగా జరిగిన ప్రదేశం కావడంతో బిజెపి జాబితా తయారీలో పెద్ద కసరత్తు చేసిన్నట్లు కనిపిస్తున్నది.